పర్యవేక్షణ లోపం.. ఆదాయానికి శాపం..! | - | Sakshi
Sakshi News home page

పర్యవేక్షణ లోపం.. ఆదాయానికి శాపం..!

Published Wed, Nov 20 2024 12:09 AM | Last Updated on Wed, Nov 20 2024 12:09 AM

పర్యవ

పర్యవేక్షణ లోపం.. ఆదాయానికి శాపం..!

భైంసాటౌన్‌: జిల్లా తూనికలు, కొలతల శాఖలో అధికారుల పర్యవేక్షణలోపంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. లైసెన్స్‌డ్‌ కాంటా రిపేరర్‌ అధికారులను తప్పుదోవ పట్టిస్తూ క్షేత్రస్థాయిలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారులు సైతం సరైన తనిఖీ చేయకుండానే స్టాంపింగ్‌ చేస్తున్నారు. ఇదే కాకుండా, ఇన్‌చార్జి బాధ్యతల నెపంతో అధికారులు క్షేత్రస్థాయిలో ఎలక్ట్రానిక్‌, మానువల్‌ కాంటాలను సకాలంలో తనిఖీలు చేయడం లేదు. వాటికి స్టాంపింగ్‌ సైతం సకాలంలో వేయకపోవడంతో తూకాల్లో మోసాలతో ఓ వైపు వినియోగదారులు, రైతులు నష్టపోతుండగా, జాప్యం కారణంగా మరోవైపు కాంటాల యజమానులు జరిమానాలు భరించాల్సి వస్తోంది.

వేల సంఖ్యలో..

జిల్లాలో వేలసంఖ్యలో ఎలక్ట్రానిక్‌, మాన్యువల్‌ కాంటలు ఉన్నాయి. పదుల సంఖ్యలో వేబ్రిడ్జిలు, పెట్రోల్‌ పంపులు ఉన్నాయి. తూనికలు, కొలతల శాఖకు సంబంధించి సంబంధిత అధికారులు తరచూ తనిఖీలు చేసి వినియోగదారులకు కచ్చితమైన సేవలు అందించాల్సి ఉండగా, జిల్లాకు రెగ్యులర్‌ అధికారి లేక, ఇన్‌చార్జి బాధ్యతలతో పర్యవేక్షణ కొరవడుతోంది. ఉన్నతాధికారులు ఈ విషయమై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.

మళ్లీ పరిశీలిస్తా..

స్టాపింగ్‌ విషయంలో ఆలస్యమైంది. డ్యూ ఫీ వసూలు విషయంలో ఎలాంటి పొరపాటు లేకుండా చూస్తాం. ఇన్‌చార్జి బాధ్యతలతో పూర్తిస్థాయిలో తనిఖీ చేయలేదు. మరోసారి పరిశీలిస్తాం. పొరపాట్లు జరిగి ఉంటే చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ ఆదాయానికి నష్టం జరగకుండా

చూస్తాం. – భూలక్ష్మి, తూనికలు కొలతల అధికారి.

జిల్లా తూనికలు కొలతల శాఖలో ఇష్టారాజ్యం

కాంట్రాక్టర్లతో చేతులు కలిిపిన అధికారులు?

తనిఖీ లేకుండానే కాంటాలపై స్టాంపింగ్‌

భైంసాటౌన్‌ పట్టణంలోని ఓ వర్తకుడికి చెందిన ఎలక్ట్రానిక్‌ కాంటాకు గతేడాది జూన్‌ 10న స్టాంపింగ్‌ చేశారు. ఈ ఏడాది జూన్‌ 9తో గడువు ముగిసింది. మరోమారు స్టాంపింగ్‌ చేయాలంటే డ్యూ ఫీ చెల్లించాలి. కానీ, ఓ లైసెన్స్‌డ్‌ కాంటా రిపేరర్‌ డ్యూ ఫీ లేకుండానే ఇటీవల కాంటాకు సీల్‌ వేశాడు. అనంతరం తూనికలు, కొలతల శాఖ జిల్లా అధికారి స్టాంపింగ్‌ వేశారు. గాంధీగంజ్‌లో పలువురు భూసార్‌ ట్రేడర్లకు చెందిన పలు ఎలక్ట్రానిక్‌ కాంటాలకు సైతం ఈ ఏడాది జూన్‌లోనే స్టాంపింగ్‌ గడువు ముగియగా, డ్యూ ఫీ లేకుండా కాంటాలకు స్టాంపింగ్‌ వేసినట్లు తెలిసింది.

ఇష్టారీతిన సర్వీస్‌ చార్జీ..!

ఇదిలా ఉండగా, గుర్తింపు పొందిన లైసెన్స్‌డ్‌ కాంటా రిపేరర్‌ ఇష్టారీతిన సర్వీస్‌ చార్జీ వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో కాంటాకు రూ.1,800 వసూలు చేస్తుండగా, ఇందులో నుంచి శాఖకు ఆన్‌లైన్‌లో రూ.300–400 మాత్రమే చెల్లిస్తూ, మిగిలిన మొత్తం సర్వీస్‌ చార్జీ కింద తీసుకున్నాడు. ఇలా ప్రభుత్వ శాఖకు మించి ప్రైవేట్‌ వ్యక్తి సర్వీసు చార్జీ ఎక్కువగా ఉండడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సర్వీసు రుసుం వసూలు చేస్తున్న రిపేరర్లు ఏడాదిలోపు కాంటాకు ఏం జరిగినా మరమ్మతు చేయాలి. కానీ, దుకాణదారులకు ఈ విషయమై అవగాహన లేక స్థానికంగా ఉన్నవారికి డబ్బులు చెల్లించి రిపేర్‌ చేయించుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
పర్యవేక్షణ లోపం.. ఆదాయానికి శాపం..! 1
1/1

పర్యవేక్షణ లోపం.. ఆదాయానికి శాపం..!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement