బీడీలు చుడుతున్న కార్మికులు
కొత్త సర్కార్ ఏర్పడి ఏడాదైనా ఎదురు చూపులే..
విజయోత్సవాల్లో ప్రకటన లేదు
జిల్లాలో అత్యధికంగా బీడీ కార్మికులు
భైంసా: రాష్ట్రంలో అత్యధికంగా బీడీ కార్మికులు ఉ న్న జిల్లా నిర్మల్. వీరికి గత ప్రభుత్వం జీవనభృతి కింద నెలకు రూ.2,016 అందించింది. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక పీఎఫ్ ఉన్న కార్మికులందరికీ జీవనభృతి ఇస్తామని కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చా రు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా భృతి ఊసే లేకపోవడంతో బీడీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా కూడా ఎలాంటి ప్రస్తావన రాలేదు.
లక్ష మంది బీడీ కార్మికులు..
జిల్లావ్యాప్తంగా లక్ష మంది బీడీ కార్మికులు ఉన్నారు. ఇందులో 62,352 మందికి గత ప్రభుత్వం రూ.వెయ్యితో జీవనభృతి ప్రారంభించింది. క్రమంగా దానిని రూ.2016కు పెంచింది. గత ప్రభుత్వం పెంచిన జీవనభృతే ఆసరా పింఛన్ల రూపంలో అందిస్తున్నారు. 2014 ముందు పీఎఫ్ కలిగిన కార్మికులకే జీవనభృతి ఇవ్వాలని నిర్ణయించారు. అప్పట్లో మాజీ సీఎం 2018 ఎన్నికలకు ముందు భైంసాలో ఎన్నికల బహిరంగ సభలో పీఎఫ్ కటాఫ్ ఎత్తివేసి ఈ పరిశ్రమపై ఆధారపడిన కార్మికులందరికీ జీవనభృతి అందిస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వం పాలన ముగిసినా కొత్తగా ఒక్కరికి కూడా జీవనభృతి అందలేదు.
అధికారంలోకి వస్తే ఇస్తామని,..
అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు బీడీ కార్మికులతో సమావేశాలు ఏర్పాటు చేశారు. తాము అధికారంలోకి వస్తే పీఎఫ్ కటాఫ్ తేదీని ఎత్తివేసి ఈ పరిశ్రమలో పనిచేసే ప్రతి ఒక్కరికీ జీవనభృతి ఇస్తామని ప్రకటించారు. కార్మిక సంఘాలు, కార్మికులతో వేర్వేరుగా సమావేశాలు ఏర్పాటు చేశారు. అయినా కొత్తగా జీవనభృతి విషయంలో ఎలాంటి ప్రకటన రాలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా జీవనభృతి అందడం లేదు.
విజయోత్సవాల్లో...
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న విజయోత్సవాల్లో బీడీ కార్మికుల ప్రస్తావన వస్తుందని ప్రతీరోజు ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ప్రభుత్వం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేపట్టింది. ఈ సర్వేలో చాలామంది కార్మికులు తమకు జీవనభృతి అందడం లేదని బీడీలు చేసి బతుకుతున్నామని సిబ్బందికి తెలిపారు. ఈ వివరాలన్నీ సిబ్బంది కంప్యూటర్లలో ఆన్‌లైన్ చేయించి ఉన్నతాధికారులకు పంపించారు. జిల్లాలో వ్యవసాయం తరువాత అత్యధికంగా బీడీ పరిశ్రమపైనే ఆధారపడి ఉన్నారు. చేతినిండా పని లేని కార్మికులు జీవనభృతి కోసం ఎదురుచూస్తున్నారు. ఈనెల 9న సోనియాగాంధీ పుట్టినరోజు సందర్భంతోపాటు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సందర్భంగా ప్రకటన చేస్తారని ఆశించారు. కానీ, ఫలితం లేకుండా పోయింది. బీడీ పరిశ్రమలో 90 శాతం మహిళలే ఉన్నారు. జీవనభృతి అందించాలని అంతా కోరుతున్నారు.
జిల్లా : నిర్మల్
నియోజకవర్గాలు : ఖానాపూర్, ముధోల్, నిర్మల్
బీడీ కార్మికులు : సుమారు లక్ష మంది
జీవనభృతి పొందుతున్నవారు : 62,352
ఎనిమిదేళ్లుగా..
జిల్లాలో సగానికిపైగా కార్మికులకు ఎనిమిదేళ్లుగా ప్రతినెలా జీవనభృతి కింద రూ.2,016 అందుతోంది. సగానికిపైగా కార్మికులు ఎనిమిదేళ్లుగా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లాలో దేశాయి, చార్‌భాయి, సాబ్లే టొబాకో, సాబ్లే వాఘరే, లంగర్ ఠాకూర్, ఇలా ఎన్నో కంపెనీలు సెంటర్లు ప్రారంభించి ప్రతీ గ్రామంలో బీడీ కంపెనీలు ప్రారంభించింది. ప్రతీ ఊరిలో రెండు నుంచి మూడు బీడీ కంపెనీలు కనిపిస్తాయి. ముధోల్, నిర్మల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో ఏ ఇంట చూసినా బీడీ చుట్టే కార్మికులు కనిపిస్తారు. ఒకే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉంటే అందులో ఒక కుటుంబానికి బీడీ పింఛన్ వస్తుంటే మరో కుటుంబం కొత్త పింఛన్ కోసం ఎదురుచూస్తోంది. ఇప్పటికై నా కార్మిక శాఖ అధికారులు తమకు వచ్చిన వినతిపత్రాలను ఉన్నతాధికారులకు నివేదించి కొత్తగా జీవనభృతి అందించాలి.
దరఖాస్తు చేసుకున్నాం..
భైంసా మున్సిపాలిటీలో బీడీ కార్మికురాలిగా జీవనభృతి కోసం దరఖాస్తు చేసుకున్నాను. ఇప్పటి వరకు పింఛన్ రావడం లేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. బీడీ కార్మికులకు పింఛన్లు ఇవ్వాలి.
– రుచిత, బీడీ కార్మికురాలు, భైంసా
ఎదురుచూస్తున్నాం..
ఏడాదిగా బీడీ పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నాం. మున్సిపాలిటీతోపాటు రెవెన్యూ కార్యాలయంలోనూ దరఖాస్తులు ఇచ్చాం. ఇప్పటివరకు ఎంతోమంది కార్మిక సంఘాలకు వినతిపత్రాలు ఇచ్చాం. కార్మిక శాఖ కార్యాలయానికి వెళ్లి పింఛన్లు ఇవ్వాలని కోరాం. – రవళిక, బీడీ కార్మికురాలు, భైంసా
Comments
Please login to add a commentAdd a comment