బాసర మండలం బిద్రెల్లి పాఠశాలలో విద్యార్ధులతో కలసి భోజనం చేస్తున్న విద్యాశాఖ కమిషనర్ (ఫైల్)
నిబంధనలతో మధ్యాహ్న భోజనం
పరిశీలన, తనిఖీకి ప్రత్యేక కమిటీలు
స్కూళ్లలో నియామకానికి ఆదేశం
ఇక విద్యార్థులకు నాణ్యమైన ఆహారం
నిర్మల్‌చైన్‌గేట్: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో భోజనంలో నాణ్యత లోపాల కారణంగా విద్యార్థులు తరచూ అస్వస్థతకు గురవుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ చేపట్టింది. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు నిర్ణయించింది. ఇందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ఆహార కమిటీలను నియమించాలని ఆదేశాలు జారీ చేసింది.
కమిటీలో ప్రధానోపాధ్యాయుడు కన్వీనర్, ఉపాధ్యాయులు సభ్యులుగా ఉంటారు. ఈ మేరకు ప్రతీరోజు వారు భోజనం చేశాక విద్యార్థులకు వడ్డించాలనే నిబంధన విధించారు. తద్వారా భోజనంలో నాణ్యత పెరుగుతుందని.. లోపాలుంటే సరిదిద్దే అవకాశం లభిస్తుందని భావిస్తున్నారు.
నాణ్యత లేకుంటే వెనక్కి..
ప్రభుత్వ వసతి గృహాలు, పాఠశాలలు, గురుకుల పాఠశాలల్లో హెచ్‌ఎం, ఉపాధ్యాయులతో కలిపి ముగ్గురితో కూడిన ఆహార కమిటీల నియామక ప్రక్రియ చివరి దశకు చేరింది. వీరు మధ్యాహ్న భోజనానికి వినియోగించే సరుకుల పరిశీలనలో కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. బియ్యంతోపాటు ఇతర వంట సామగ్రిని ఏజెన్సీ నిర్వాహకులు ఇష్టానుసారంగా తీసుకురాకుండా పర్యవేక్షించాలి. సరుకుల్లో నాణ్యత ఉంటేనే అనుమతించాలని, లేకుంటే తిప్పి పంపాలని స్పష్టమైన ఆదేశాలు అందాయి.
అంతేకాకుండా మధ్యాహ్న భోజనం తయారీకి వాడుతున్న బియ్యంతో పాటు కారం, అల్లం, వెల్లుల్లి, కూరగాయలు, నూనె తదితర సామగ్రి నాణ్యతగా ఉందా, లేదా అని కూడా పరిశీలించాలి. ఆపై వంట చేసే ప్రదేశం శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. కాగా, ప్రతిరోజూ వంట చేసే సమయంలో ఫొటోలు తీసి విద్యాశాఖ యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. ఆపై కమిటీ సభ్యులు భోజనం చేసి అంతా బాగుందని నిర్ధారించుకున్నాకే విద్యార్థులకు వడ్డించాలి. ఈ కమిటీలను ప్రభుత్వ పాఠశాలలతో పాటు కేజీబీవీలు, గురుకుల పాఠశాలలు, ఆదర్శ పాఠశాలల్లో వెంటనే నియమించాలని అధికారులు సూచించారు. ఈ కమిటీతో పాటు మండల స్థాయిలో వివిధ శాఖల అధికారులూ నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంటుంది. ప్రతీ బుధవారం విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
నిధులు పెంచితేనే ఫలితం
మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు ఎన్నో ఏళ్లుగా ధరలు పెరగడం లేదు. ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యార్థులకు చాలీచాలని నిధులతో అరకొరగా భోజనం వండి పెడుతున్నారు. పైగా నెలల తరబడి బకాయిలు చెల్లింపులకు నోచుకోక ఏజెన్సీ నిర్వాహకులు వంట తయారీలో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తెలుస్తోంది. నిధులు పెంచితేనే పిల్లలకు నాణ్యమైన భోజనం ఆందించే వీలుంటుంది.
కమిటీల బాధ్యతలివే..
ప్రతీరోజు వంట గదులను పరిశీలించాలి. నాణ్యమైన కూరగాయలు వస్తున్నాయా.. లేదా.. అని తనిఖీ చేయాలి.
వంటకు ఉపయోగించే ఇతర దినుసులు కూడా నాణ్యమైనవేనా.. ఉపయోగానికి గడువు ఉందా.. అని పరిశీలించాలి.
ఉపాధ్యాయులు తిన్న తర్వాతే విద్యార్థులకు భోజనం వడ్డించాలి.
టీచర్లు భోజనం చేశాక రుచిపై అభిప్రాయాలను రిజిస్టర్‌లో నమోదు చేయాలి.
రుచి బాగుందా.. లేదా.. అనే విషయంపై విద్యార్థుల అభిప్రాయాలు తీసుకుని రిజిస్టర్‌లో సంతకాలు చేయించాలి.
వంటలను పాఠశాలలోనే చేయించాలి. ఏజెన్సీ బాధ్యులు ఇంటి వద్ద వండుకుని తీసుకువస్తే నిరాకరించాలి.
ఏజెన్సీ నిర్వాహకులు శుభ్రత పాటించేలా చర్యలు తీసుకోవాలి.
పాఠశాలలోని వంట గది, కార్యాలయంలో మెనూ చార్ట్ ఏర్పాటు చేయాలి.
ఆహార కమిటీ బాధ్యుల పేర్లు, ఫోన్ నంబర్లు చార్ట్‌లో నమోదు చేయాలి.
నాణ్యత పెంచేందుకే..
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు కలెక్టర్ ఆదేశాలతో పకడ్బందీ చర్యలు చేపట్టాం. అన్ని పాఠశాలల్లో ఆహార కమిటీల నియామకానికి చర్యలు తీసుకున్నాం. నాణ్యతా ప్రమాణాలు పాటించాలని వంట సిబ్బందికి సూచించాం. ఎంఈవోలు తరచూ పాఠశాలలను సందర్శించి భోజనాన్ని తనిఖీ చేస్తారు. – రామారావ్, డీఈవో
Comments
Please login to add a commentAdd a comment