గాడి తప్పిన పాలన
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై దాదాపు ఏడాది కాలం పూర్తి కావొచ్చింది. పాలన గాడిలో పడుతుందనుకుంటే పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది. రోజురోజుకూ మరింత తీసికట్టుగా తయారవుతోంది. అక్రమాలు, లోపాలు, వైఫల్యాలపై సమీక్షలు చేయాల్సిన ఉన్నతాధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో అంతా ఇష్టారాజ్యం అయింది. మరోవైపు అక్రమాలకు, అవినీతికి కేరాఫ్‌గా మారిన కొందరు జిల్లా అధికారులను కొందరు కాంగ్రెస్ నాయకులు పెంచి పోషిస్తున్నారు. దీంతో సదరు అధికారులు తమదే రాజ్యమన్నట్లు ప్రవర్తిస్తున్నారు. జిల్లా బాస్ కలెక్టర్ ఆయా శాఖల్లో తనిఖీలు చేయకపోతుండడంతో కొన్ని శాఖల అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. అత్యధిక కార్యాలయాలు ఉన్న సమీకృత కలెక్టరేట్‌లోనూ కలెక్టర్ తనిఖీలు లేక అంతా అస్తవ్యస్తమైనట్లు చర్చ నడుస్తోంది. మరోవైపు జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లాలో కీలక శాఖల్లో పాలనా వైఫల్యాల విషయంలో ఏమాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.
● ఇటీవల జిల్లాలో టీచర్ల రిక్రూట్‌మెంట్ల విషయంలో చోటుచేసుకున్న విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం చూస్తే ఎవరైనా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి. అభ్యర్థుల జీవితాలతో ఆటలాడుకునే విధంగా వ్యవహరించారు. చివరకు సాంకేతిక తప్పిదం అంటూ చేతులు దులుపుకున్నారు. ప్రస్తుతం పరిస్థితి ఏవిధంగా తయారైందంటే ఉద్యోగం వచ్చినవారు సైతం తమ ఉద్యోగాలు ఉంటాయో.. ఊడుతాయోనని భయపడే స్థితి నెలకొంది. నియామక పత్రాలిచ్చి పాఠాలు చెప్పాక తప్పిదం జరిగిందని ఉద్యోగం లేదని చెబుతుండడంతో అభ్యర్థులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ తప్పిదాల కారణంగా జిల్లాలో 640 పోస్టులకుగాను కేవలం 452 పోస్టులు మాత్రమే భర్తీ కావడం గమనార్హం.
● జిల్లా పంచాయతీ కార్యాలయంలో పాలనాధికారి అవినీతి పర్వం మరొకటి. బిల్లులు క్లెయిమ్ చేసుకునేందుకు, సెలవులు పెట్టుకునేందుకు వచ్చిన పంచాయతీ కార్యదర్శుల వద్ద వసూళ్లు చేస్తుండడం గమనార్హం. జిల్లా బాస్ పర్యవేక్షణ లేకపోవడంతో పంచాయతీల పాలన విషయంలో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి.
● కలెక్టరేట్‌లో సైతం పాలనాధికారి (ఏవో) ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో ప్రజా సమస్యల పరిష్కారం సంగతి అటుంచితే ప్రజలకు మరిన్ని కొత్త సమస్యలు వస్తున్నాయంటూ ఆరోపణలు వస్తున్నాయి. రెవెన్యూ, భూముల వ్యవహారాల్లో పాలనాధికారి తహసీల్దార్‌లను తీవ్రంగా వేధిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ●
● దేవాదాయ శాఖ భూములను రక్షించే విషయంలోనూ అధికారులతో పాటు ఉన్నతాధికారులు ఏ మాత్రం పట్టనట్లుగా వ్యవహరిస్తుండడంతో సదరు భూములు 90 శాతం అన్యాక్రాంతం అయ్యాయి. వీటి ఆక్రమణలు తొలగించలేని పరిస్థితికి తీసుకొస్తున్నారనే ఆరోపణలున్నాయి.
● జిల్లాలో వందల సంఖ్యలో అక్రమ మొరం క్వారీలు నడుస్తున్నాయి. కేవలం మూడు క్వారీలకు మాత్రమే అనుమతులు ఉండడంతో అక్రమ తవ్వ కాలకు అదుపు లేకుండా పోయింది. ఇక ఇసుక తవ్వకాల విషయానికి వస్తే అధికారులు, కొన్ని చోట్ల పోలీసు అధికారులు ఈ అక్రమ తోలకాల వ్యాపారం చేస్తుండడం విశేషం.
● డిఫాల్ట్ మిల్లర్లపై ఇప్పటివరకు ఏమాత్రం చర్యలు తీసుకోలేదు. దీంతో మిల్లర్ల ఇష్టారాజ్యం అయిపోయింది. ఈ విషయమై ఏవిధమైన చర్యలు తీసుకున్నారని ఇటీవల జిల్లాకు వచ్చిన మంత్రి జూపల్లి కృష్ణారావు కలెక్టర్‌ను అడిగారు. దీనికి తగిన సమాధానం ఇవ్వలేదని తెలిసింది. వారం రోజుల్లో చర్యలు తీసుకోవాలని మంత్రి చెప్పినట్లు సమాచారం.
ప్రయివేట్‌కు రిఫరల్ కేసులు
జిల్లాలో ప్రైవేటు ఆస్పత్రుల్లో సిజేరియన్లు వి చ్చలవిడిగా చేస్తున్నారు. గతంలో ఈ విషయ మై అప్పటి కలెక్టర్ నారాయణరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని నిరంతరం పర్యవేక్షించారు. దీంతో అప్పట్లో సిజేరియన్లు తగ్గాయి. అయితే ఇప్పుడు వీటి విషయమై కలెక్టర్ పట్టించుకోకపోతుండడంతో సిజేరియన్లు పెరుగుతున్నా యి. మరోవైపు జీజీహెచ్ నుంచి ప్రైవేటుకు రిఫరల్ కేసులు వెళుతున్నాయి. దీనిపైనా నిఘా కరువైంది.
సమీకృత కలెక్టరేట్‌లో జిల్లా బాస్ నజర్ కరువు..
ఆయా శాఖల్లో ఇష్టారాజ్యం
ఉపాధ్యాయ నియామకాల్లో కొట్టొచ్చిన నిర్లక్ష్యం
సాంకేతిక తప్పులంటూ చేతులు దులుపుకున్న విద్యాశాఖ
జిల్లా పంచాయతీ కార్యాలయంలో జీపీల వద్దే వసూళ్లు
కలెక్టరేట్‌లో పాలనాధికారి (ఏవో) ఇష్టారాజ్యం
దేవాదాయ భూములు కాపాడడంలో అంతులేని జాడ్యం
అడ్డూ అదుపూ లేని మొరం, ఇసుక అక్రమ తవ్వకాలు
డీఫాల్ట్ మిల్లర్లపై చర్యలు శూన్యం
విచ్చలవిడిగా సిజేరియన్లు.. పట్టించుకోని అధికారులు
నగరపాలక సంస్థలో అక్రమాల పుట్ట
పట్టింపులేని ఇన్‌చార్జి మంత్రి జూపల్లి
సంక్షేమ వసతి గృహాల్లో ఎక్కడ చూసినా సమ స్యలే కనిపిస్తున్నాయి. తాము అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ కలెక్టర్ ఏమాత్రం దృష్టి పెట్ట లేదని విద్యార్థులు వాపోతున్నారు.
జిల్లా వ్యవసాయ అధికారి ఇబ్బందులు పెడు తున్నాడంటూ గతంలో మండల వ్యవసాయ అధికారులు జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయంలో నిరసన వ్యక్తం చేశారు. మత్స్య శాఖ ద్వారా చేపపిల్లల పంపిణీ ఆలస్యం చేయడంతో సొసైటీలు ఇబ్బంది పడ్డాయి. మరోవైపు సహకార సంఘాలు భారీ నష్టాల్లోకి కూరుకుపోతున్నాయి. గత జిల్లా సహకార అధికారి సింహాచలం అక్రమాలపై ఆధా రాలున్నప్పటికీ వీటిపై సమీక్ష కరువైంది.
రిజిస్ట్రేషన్ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. అత్యధిక ప్రభుత్వ కార్యాలయా లు సమీకృత కలెక్టరేట్‌లోకి వెళ్లాయి. దీంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలను ఆయా ఖాళీ అయిన ప్రభుత్వ భవనాల్లోకి మార్చా లని డిమాండ్లు ఉ న్నాయి. కలెక్టర్ పట్టించుకోవడం లేదు.
నిజామాబాద్ నగరపాలక సంస్థలో అవినీతి తవ్వినకొద్దీ ఉంటోంది. భవన నిర్మాణాల అనుమతుల నుంచి మ్యుటేషన్లు, టాక్స్ అసెస్‌మెంట్ విషయంలో భారీ అవినీతి చోటుచేసుకుంటోంది. సెల్లార్‌లు, ఫైర్, పార్కింగ్ అనుమతులు లేకున్నప్పటికీ కొందరు మున్సిపల్ అధికారులే బినా మీలతో బిల్డర్లుగా వ్యవహరిస్తున్నారు. వీటిపై ఏమాత్రం తనిఖీలు లేవు.
Comments
Please login to add a commentAdd a comment