అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం
నిజామాబాద్ అర్బన్ : అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నట్లు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. ప్రభుత్వానికి ప్రజలు మద్దతుగా నిలుస్తూ ఆశీర్వదించాలని కోరారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో బుధవారం సాయంత్రం ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన భూపతిరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే ఆరు గ్యారంటీలలో రెండు గ్యారంటీలను అమలు చేసిందన్నారు. రైతులకు రూ.31 వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేశామన్నారు. ఏడాది కాలంలోనే 50 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు తెలిపారు. హాస్టల్ విద్యార్థులకు కాస్మెటిక్స్, మెస్ చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని పేర్కొన్నారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా రూ.125.91 కోట్ల లబ్ధి చేకూర్చిందని, జిల్లాలో ప్రతిరోజు సగటున 93 వేల మంది మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారని తెలిపారు. వివిధ పథకాల లబ్ధి పొందుతున్న వారి వివరాలను కలెక్టర్ వివరించారు. జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే ప్రక్రియ తుది దశకు చేరిందన్నారు. అన్ని వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుందని తెలిపారు. ఈ నెల 19 నాటికి 84.8శాతం సర్వే పూర్తియిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి, అదనపు కలెక్టర్ అంకిత్, ట్రెయినీ కలెక్టర్ సంకేత్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్, ఆర్డీవో రాజేంద్ర కుమార్, మెప్మా పీడీ రాజేందర్ పాల్గొన్నారు.
రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి
ఘనంగా ప్రజాపాలన విజయోత్సవాలు
అలరించిన కళా ప్రదర్శనలు
Comments
Please login to add a commentAdd a comment