రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల ధాన్యానికి బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిందన్నారు. కానీ ఇప్పుడు సన్న వడ్లకే బోనస్ ఇస్తామనడం రైతులను వచించడమేనన్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని ఆర్భాటంగా చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో కొనుగోళ్లు వేగంగా జరగడం లేదన్నారు. రైతులకు బోనస్ ఎగ్గొట్టేందుకే ప్రభుత్వం కొనుగోళ్ల విషయంలో జాప్యం చేస్తోందని ఆరోపించారు. కాంటాలు ఆలస్యంగా అవుతుండటంతో రైతులు తప్పని పరిస్థితుల్లో ప్రైవేటుకు అమ్ముకుంటూ నష్టపోతున్నారన్నారు. ప్రైవేటు వ్యాపారులకు ధాన్యం అమ్ముకున్న రైతులకూ బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ శాఖ వద్ద రైతుల వారీగా సాగు విస్తీర్ణం వివరాలు ఉంటాయని, వాటి మేరకు ఎకరాకు 25 క్వింటాళ్ల చొప్పున బోనస్ అందించాలన్నారు. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల్లో తీసుకుంటున్న దొడ్డు రకం వడ్లకు కూడా బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే రైతులతో కలిసి ఆందోళనలు చేస్తామన్నారు.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే
వేముల ప్రశాంత్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment