రాజ్యాంగ స్ఫూర్తిని అలవర్చుకోవాలి
అదనపు కలెక్టర్ అంకిత్
నిజామాబాద్ అర్బన్: యువత రాజ్యాంగ స్ఫూర్తిని అలవర్చుకోవాలని అదనపు కలెక్టర్ అంకిత్ అన్నారు. మంగళవారం నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ నిజామాబాద్ ఫీల్డ్ ఆఫీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ దినోత్సవంలో అదనపు కలెక్టర్ అంకిత్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి పాల్గొన్నారు. అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం రాజ్యాంగ ప్రతిజ్ఞ చేశారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రాజ్యాంగం ప్రతి పౌరుడికి హక్కులతో పాటు బాధ్యతలు రూపొందించిందన్నారు. సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం చాలా గొప్పదని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం వాటిళ్లితే పౌరులు కోర్టుల ద్వారా న్యాయం పొందవచ్చన్నారు. అనంతరం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. పాలిటెక్నిక్ కళాశాల నుంచి కంఠేశ్వర్ వరకు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సీబీసీ ఎఫ్‌పీవో ధర్మానాయక్, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ బి నరేశ్, తెలంగాణ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ రవీంద్రరెడ్డి, జిల్లా యువజన అధికారి శైలి బెల్లాల్, ఆకాశవాణి ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మోహన్ దాస్, శరత్, అధ్యాపకులు బి రామచంద్ర, రవి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment