వరద కాలువ ద్వారా నీటి విడుదల
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి వరద కాలువ ద్వారా నీటి విడుదలను అధికారులు మంగళవారం ఉద యం ప్రారంభించారు. కాలువ ద్వారా ముందుగా 500 క్యూ సెక్కుల నీటిని వదిలి క్రమంగా 2 వేల క్యూసెక్కులకు పెంచారు. వరద కాలువ నీటి ఆధారంగా మధ్య మానేరు వరకు సాగవుతున్న ఆయకట్టుకు నీరు అందించుట కోసం నీటి విడుదల చేపట్టినట్లు ప్రాజెక్ట్ ఈఈ చక్రపాణి తెలిపారు.
ఐదు టీఎంసీల నీటి వినియోగం
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి ఆయకట్టు కోసం ప్రధాన కాలువల ద్వారా నీటి విడుదలను డిసెంబర్ 25న ప్రారంభించారు. వారం రోజుల వ్యవధిలో ప్రాజెక్ట్ నుంచి ఐదు టీఎంసీల నీరు వినియోగం జరిగింది. కాకతీయ కాలువ ద్వారా 5,500 క్యూసెక్కులు, లక్ష్మికాలువ ద్వారా 200 క్యూసెక్కులు, అలీసాగర్ లిఫ్ట్ ద్వారా 463 క్యూసెక్కులు, గుత్ప లిఫ్ట్ ద్వారా 270 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 700 క్యూసెక్కులు, ఎత్తిపోతల పథకాలకు 312 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 (80.5 టీఎంసీలు) అడుగులు కాగా మంగళవారం సాయంత్రానికి ప్రాజెక్ట్ 1089.70 (75.5 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు.
కొనసాగుతున్న నిజాంసాగర్ నీటి విడుదల
నిజాంసాగర్: నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువ కు నీటి విడుదల కొనసాగుతోంది. ప్రస్తుతం వెయ్యి క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు(17.8 టీఎంసీలు) కాగా 1,402.95 అడుగుల(14.917 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. వారబందీ ప్రకారం 15 రోజుల పాటు నీటిని విడుదల చేసి 10 రోజుల పాటు బంద్ చేయాల్సి ఉండగా వరి నాట్లు జోరందుకోవడంతో నీటి విడుదలను పొడిగించారు.
Comments
Please login to add a commentAdd a comment