సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలోని ఇందల్వాయి పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ బి మనోజ్ పై లింగాపూర్ గ్రామానికి చెందిన లింగాపూర్ సంతోష్‌రెడ్డి, దగ్గి సతీష్‌లు మల్టీజోన్–1 ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌కు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ మనోజ్ భారీ అవినీతికి పాల్పడుతూ మండల ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్‌ఐ సొంతంగా జేసీబీలతో లింగాపూర్ వాగు, గౌరారం వాగుల నుంచి ఇసుకను తవ్వించి జైపాల్ నాయక్, శ్రీను, రమేష్ అనే వ్యక్తులతో టిప్పర్, ట్రాక్టర్‌ల ద్వారా రవాణా చేయిస్తున్నాడని, భారీగా డబ్బు సంపాదిస్తున్నాడని, గతంలో ఏ అధికారీ ఇలా చేయలేదని తెలిపారు. ఇప్పటికే మనోజ్ ఇసుక అక్రమ రవాణా విషయమై డీజీపీ మెమో సైతం ఇచ్చినట్లు పేర్కొన్నారు. అయితే ఆ సమయంలో సీపీ బదిలీ కావడంతో చర్యలు తీసుకోలేదని ఫిర్యాదులో తెలిపారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న విషయమై వార్తలు సైతం వచ్చినట్లు పేర్కొన్నారు. పైగా ఎస్‌ఐ మనోజ్ ప్రతి కేసులో డబ్బులు డిమాండ్ చేస్తూ భారీగా వసూలు చేస్తున్నాడని వివరించారు. డబ్బులు ఇవ్వని వారిని బెదిరించడం, ఇష్టం వచ్చినట్లు కొట్టడం చేస్తున్నట్లు పేర్కొన్నారు. 20 రోజుల క్రితం ఒక కేసు విషయంలో నల్లవెల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని డబ్బుల విషయంలో రక్తం వచ్చేలా కొట్టగా, సదరు వ్యక్తి తిరిగి ఎస్సైని కొట్టడంతో గాయాలైనట్లు మండలంలో చర్చ జరుగుతోందని పేర్కొన్నారు. ఒక రాజకీయ నాయకుడి ద్వారా ఇద్దరూ రాజీ చేసుకున్నట్లు తెలుస్తోందన్నారు. మండల ప్రజలకు న్యాయం చేయాల్సింది పోయి పోలీసుల పరువు తీస్తున్నట్లు ఫిర్యాదులో రాశారు. నల్లవెల్లి గ్రామ రైతుల వద్ద బలవంతంగా ఒక కేసులో రూ.50 వేలు వసూలు చేశాడని తెలిపారు. ప్రభుత్వం రైతులకు మేలు చేస్తుంటే ఎస్సై మనోజ్ రైతుల వద్ద బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నాడని, అదేవిధంగా మట్టి ట్రాక్టర్ల వద్ద సైతం భయపెట్టి డబ్బులు వసూలు చేస్తుండడం పట్ల ప్రజలు విసుగుమ చెందుతున్నట్లు వివరించారు. ఇతని అవినీతి గురించి మండలంలో అందరికీ తెలుసని, తక్షణమే తగిన విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment