నిజాం షుగర్స్‌ను తెరిపిస్తాం
● చెరుకు సాగుకు రైతులు
ముందుకు రావాలి
● రైతులతో సమావేశంలో
బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి
ఎడపల్లి(బోధన్): ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి తెలిపారు. శనివారం ఎడపల్లి శివారులోని ఓ ఫంక్షన్ హాల్‌లో చెరుకు రైతుల నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు చెరుకు సాగుకు ముందుకు వస్తే ప్రభుత్వ పరంగా తోడ్పాటు అందిస్తామన్నారు. రైతుల ప్రయోజనాల కోసం నిజాం షుగర్స్‌ను తెరిపించాల్సిన అవసరం ఉందని సీఎం దృష్టికి తీసుకువెళ్లగా సానుకూల స్పందించినట్లు తెలిపారు. ఫ్యాక్టరీకి సంబంధించి సుమారు రూ.190 కోట్ల బకాయిలను ప్రభుత్వం చెల్లించిందన్నారు. చెరుకు సాగుకు రైతులు సంసిద్ధత తెలిపితే కర్మాగారాన్ని తెరిపించి నిజాం షుగర్స్‌కు పూర్వ వైభవం తీసుకు వస్తామని తెలిపారు. చెరుకు ఫ్యాక్టరీకి అనుబంధంగా ఉన్న డిస్టిల్లరీ యూనిట్‌ను కూడా తెరిపించాలని ధృడ సంకల్పంతో ఉన్నామన్నారు.
పంటమార్పిడితో అధిక దిగుబడులు
పంట మార్పిడితో అధిక దిగుబడులు వస్తాయని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. సన్న రకం వరి ధాన్యానికి బోనస్ ఇచ్చినట్లే చెరుకుకు కూడా ఇచ్చే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. అధిక దిగుబడులను అందించే వంగడాలను విత్తుకుని సరైన యాజమాన్య పద్ధతులను పాటిస్తే చెరుకు లాభసాటి పంట అన్నారు.
సబ్సిడీలు అందిస్తాం
చెరుకు పంట సాగు చేసే రైతులకు ప్రభుత్వం నుంచి సబ్సిడీలు అందించేందకు కృషి చేస్తామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. చెరుకు సాగుకు రైతులు ముందకు రావాలన్నారు. సదస్సులో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్‌రావు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ రమేశ్ రెడ్డి, ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో పాల్గొన్నారు.
రోజుకు 3500 టన్నులు అవసరం
చెరుకు సాగుకు ఇక్కడి భూములు అనుకూలంగా ఉన్నాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు బాలాజీ నాయక్, విజయ్ కుమార్ తెలిపారు. చెరుకు పంటతో సమకూరే లాభాలు, ఆధునిక యంత్ర పరికరాలు, అధిక దిగుబడిని అందించే వంగడాలు, చెరుకు సాగులో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు తదితర విషయాలపై రైతులకు అవగాహన కల్పించారు. నిజాం షుగర్స్ తిరిగి తెరిపించి క్రషింగ్ చేపట్టాలంటే ప్రతిరోజూ కనీసం 3500 మెట్రిక్ టన్నుల చెరుకు నిల్వలు అవసరం అవుతాయన్నారు. ఏడాదిలో 130 రోజుల వరకు గానుగ ఆడించాల్సి ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment