పూర్తి కాని ఇందిరమ్మ ఇళ్ల సర్వే
మోర్తాడ్(బాల్కొండ): ఇందిరమ్మ ఇళ్ల సర్వేకు అన్ని చిక్కులే ఎదురవుతున్నాయి. సొంతూరిలో ఇంటిని నిర్మించుకోవాలని ప్రజాపాలనలో దరఖాస్తులు సమర్పించిన కొందరు ఉపాధి, పిల్లల చదువు నిమిత్తం పొరుగు గ్రామాలకు వెళ్లిపోవడం, మరి కొందరు పట్టణాల్లో ఉంటుండటంతో వారి సర్వే పూర్తి చేయడానికి కార్యదర్శులు నానా తంటాలు పడుతున్నారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల ఆర్థిక సాయం కోసం 3.20లక్షల దరఖాస్తులు అధికారులకు అందాయి. ఈ దరఖాస్తుల ప్రకారం గడచిన డిసెంబర్ 31లోగానే సర్వే పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు విధించింది. సకాలంలో సర్వే పూర్తి చేయాలని భావించినా క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా సర్వే ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికి జిల్లాలో 70 శాతం నుంచి 80 శాతం వరకు సర్వే పూర్తి అయింది. మిగిలిన సర్వేను పూర్తి చేయడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది.
ఇల్లు ఉన్నవారు కూడా..
ఇందిరమ్మ ఇంటి నిర్మాణ సాయం కోసం దరఖాస్తులు సమర్పించిన వారిలో అనేక మంది సొంతంగా ఇల్లు ఉన్నవారు ఉన్నట్లు అనేక చోట్ల వెలుగులోకి వచ్చింది. అదనంగా గదులు నిర్మించుకుంటామని, లేదంటే తమకు ఉన్న ఇద్దరి సంతానంలో ఈ ఇల్లు ఒకరికై తే మరోటి కట్టుకుంటామని చెబుతున్నారు. మరికొందరు పాత ఇంటిని తొలగించి కొత్తగా నిర్మాణం చేపడతామని సర్వేలో అధికారులకు వివరించినట్లు తెలుస్తుంది. అద్దె ఇళ్లలో ఉంటున్నవారు తమకు అసలే స్థలం లేదని చెబుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సొంతంగా జాగా ఉండి అద్దె ఇంటిలో ఉన్నవారు, వరదలు, అగ్ని ప్రమాదాల్లో ఇళ్లను కోల్పోయిన వారికి ఇంటి నిర్మాణం కోసం సాయం అందించాల్సి ఉంది.
ఫొటోలు తప్పనిసరి కావడంతో..
సర్వే చేస్తున్న కార్యదర్శులు దరఖాస్తుదారుడి పరిస్థితిని తెలియజేయడానికి ఫొటోలు తీయా ల్సి వస్తుంది. దరఖాస్తుదారుడు ఉంటున్న ఇంటిని, అతని స్థలం, ఇంటి పరిస్థితి తెలిసేలా, ఇంటి స్థలానికి సంబంధించి కాగితాల ఫొటోలు తీయాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా సర్వేకు కార్యదర్శులు వెళ్లిన సమయంలో దరఖాస్తుదారులు లేకపోవడంతో రెండు, మూడుమార్లు వెళ్లాల్సి వస్తుంది. దరఖాస్తుదారులు అందుబాటులో లేనిచోట సర్వే పూర్తి చేయడానికి ఎక్కువ సమయం తీసుకోవాల్సి వస్తోంది. ప్రతి దరఖాస్తును పరిశీలించి సర్వే పూర్తి చేయాలని ఆదేశాలు అందడంతో ఇబ్బందికరమైన పరిస్థితే ఉందని కార్యదర్శులు చెబుతున్నారు.
పలువురు దరఖాస్తుదారులు
ఇళ్ల వద్ద లేకపోవడంతో ఇబ్బందులు
Comments
Please login to add a commentAdd a comment