పోరుకు ముందే సెగ
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటన రాజకీయ వేడిని రగిల్చింది. గ్రామ పంచాయతీ, ప్రజా పరిషత్ పాలకవర్గాల కాలపరిమితి ముగియడం, మున్సిపల్, నగరపాలక సంస్థల కాలపరిమితి ఈ నెలలో ముగియనుండడంతో సహజంగానే రాజకీయ పార్టీల శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. ఇప్పటికే స్థానిక సంస్థల రిజర్వేషన్ల కేటాయింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం కులగణన సర్వే సైతం పూర్తి చేసింది. దీంతో అన్ని పార్టీలు స్థానిక పోరుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా కవిత పర్యటన మరింత వేడిని పెంచింది. కవిత చేసిన విమర్శలకు కాంగ్రెస్, బీజే పీ నియోజకవర్గ, జిల్లా స్థాయి నాయకులు ప్రతి విమర్శలు చేస్తున్నారు. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ సైతం కవిత విమర్శలకు బదులు ఇచ్చారు. స్థానిక ఎన్నికల్లో పాగా వేసేందుకు మూడు పార్టీల నాయకులు గట్టి పట్టుదలతో ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు పరిషత్‌లపై దృష్టి గట్టిగా పెట్టగా, నిజామాబాద్ నగరపాలక సంస్థ, బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్ మున్సిపాలిటీల విషయమై బీజేపీ భారీగా ఫోకస్ చేసింది. దీంతో రాజకీయం రసకందాయంలో పడింది.
● బీజేపీ నాయకులు సైతం కవితకు గట్టిగా కౌంటర్లు ఇస్తున్నారు. నిజామాబాద్ నగరపాలక సంస్థ పార్టీ ఫ్లోర్ లీడర్ స్రవంతిరెడ్డి స్పందించారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలోనే వలస పక్షి తిరిగి వచ్చిందన్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈసారి మేయర్ పీఠం బీజేపీదేనన్నారు. తనది భయపడే రక్తం కాదని కవిత అంటున్నారని, ఆమెది జలగలా పీల్చుకునే రక్తమన్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో, 2020 నగరపాకల సంస్థ ఎన్నికల్లో కవిత పవర్ ఏమిటో చూశామని స్రవంతిరెడ్డి ఎద్దేవా చేశారు. మొత్తం మీద కవిత పర్యటన జిల్లాలో పొలిటికల్ హీట్ పెంచింది.
పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ కవితకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ బీసీలను అణగదొక్కిందన్నారు. లిక్కర్ కుంభకోణంలో మరక అంటించుకున్న కవితకు ప్రాధాన్యం తగ్గిందని, ఉనికిని కాపాడుకునేందుకే బీసీల పేరిట నాటకమాడుతున్నారన్నారు. అధికారం పో యాక కపట ప్రేమ, మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. బీసీలను బీఆర్‌ఎస్‌కు అధ్యక్షుడిని చేయగలరా అని మహేశ్‌గౌడ్ సవాల్ చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ మేరకు స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకే కులగణన చేశామన్నారు. డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి సైతం కవితకు కౌంటర్లు ఇచ్చారు. ఉనికి కాపాడుకునేందుకే కవిత అసత్యాలు మాట్లాడుతున్నారన్నారు. ఎవరి హయాంలో నేరాలు పెరిగాయో చర్చ చేద్దామన్నారు. కవిత ఎంపీగా ఉన్నప్పుడు, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు జిల్లా సమస్యలను పట్టించుకోలేదన్నారు. ఇక నిజాం షుగర్స్ విషయంలో బీఆర్‌ఎస్ ఏం చేసిందో అందరికీ తెలుసన్నారు.
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని
ఉవ్విళ్లూరుతున్న మూడు పార్టీలు
ఎమ్మెల్సీ కవిత జిల్లా పర్యటన
నేపథ్యంలో వేడెక్కిన రాజకీయాలు
కవిత విమర్శనాస్త్రాలకు గట్టిగా
బదులిస్తున్న కాంగ్రెస్, బీజేపీ
జిల్లాలో ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యా ఖ్యలు కాక రేపాయి. నిజామాబాద్ ఎంపీ ఉన్నా లేనట్లేనని, రాష్ట్రంలో కాంగ్రెస్‌కు బీజేపీ తోకపార్టీగా మారిందని కవిత విమర్శలు చేయడంతో పాటు, కాంగ్రెస్‌పై గట్టి విమర్శలు చేశారు. మరోవైపు జిల్లా సమస్యలపై దృష్టి పెట్టకుండా నిజామాబాద్‌లో నిడ్రా ఏర్పాటు చేస్తామని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఏవిధంగా చెబుతారని కవిత విమర్శించారు. నిజాం షుగర్స్ తెరిపించే విషయంలో కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని కవిత విమర్శించడంతో పాటు శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం విఫలమైందని, కాంగ్రెస్ ఫ్రెండ్లీ పోలీసింగ్ నడుస్తోందని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment