మృతిచెందిన రెండేళ్లకు న్యాయం
నిజామాబాద్ నాగారం: గల్ఫ్‌లో 2022లో జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లావాసి మృతిచెందగా, రెండేళ్లకు బాధిత కుటుంబానికి నష్టపరిహారం అందింది. వివరాలు ఇలా.. నిజామాబాద్ జిల్లా జగ్గిర్యాల గ్రామానికి చెందిన గద్దల రాజా ఉపాధి నిమిత్తం గల్ఫ్‌దేశం వెళ్లగా, 2022 డిసెంబర్ 27న షార్జాలోని ఓ రోడ్డు దాటుతుండగా పాకిస్తానీయుడి వాహనం ఢీకొట్టింది. ఘటనలో అతడు తీవ్రంగా గాయపడగా స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఘటనపై అక్కడి పోలీసులు కేసునమోదు చేయగా, విచారణ జరిపిన కోర్టు అనధికార స్థలంలో రహదారి దాటినట్లు అభియోగం మోపి, కేసును కొట్టేసింది. దీంతో మృతుడి బంధువులు యాబ్ లీగల్ సర్వీసెస్ సీఈవో సలాం పాపినేసరిని ఆశ్రయించారు. వారు మళ్లీ కోర్టులో కేసు వేసి, వాదనలు వినిపించారు. రోడ్డు దాటుతున్న పాదదారులను పట్టించుకోకుండా వాహనం నడిపిన పాకిస్తానీ వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. వాదనల అనంతరం బాధిత కుటుంబానికి ప్రమాదానికి కారణమైన వ్యక్తి నష్టపరిహా రం అందించాలని కోర్టు తీర్పునిచ్చింది. యాబ్ లీగల్ సర్వీసెస్ సీఈవో సలాం కృషి ఫలితంగా బాధిత కుటుంబానికి రూ.50లక్షల నష్టపరిహారం దక్కింది. సలాం సోమవారం నిజామాబా ద్‌కు వచ్చి బాధిత కుటుంబానికి చెక్కును అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భారతీయులకు గల్ఫ్ దేశాలలో యాబ్ లీగల్ సర్వీసెస్ న్యాయ సహాయంలో అండగా నిలుస్తుందన్నారు. భారతీయులకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా మా సర్వీసెస్‌ను ఆశ్రయించాలని సూచించారు. నిజామాబాద్ రావడం ఎంతో ఆనందం కలిగించిందని అన్నారు. సంస్థ సభ్యుడు షేక్ ఆల్ అజీజ్, అబ్దుల్ రావుఫ్, మునీత్ తదితరులు ఉన్నారు.
గల్ఫ్ దేశంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో
జిల్లావాసి మృత్యువాత
ఘటనపై అక్కడి కోర్టులో విచారణ
బాధిత కుటుంబానికి నష్టపరిహారం అందజేత
Comments
Please login to add a commentAdd a comment