పట్టుబట్టి పసుపు బోర్డు | - | Sakshi
Sakshi News home page

పట్టుబట్టి పసుపు బోర్డు

Published Tue, Jan 14 2025 8:24 AM | Last Updated on Tue, Jan 14 2025 8:24 AM

పట్టు

పట్టుబట్టి పసుపు బోర్డు

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: పసుపు బోర్డు సాధిస్తాననే హామీ, నినాదంతో ఇందూరు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఎంపీ ధర్మపురి అర్వింద్‌ పట్టువదలని విక్రమార్కుడిలా ఒక్కో అడుగు ముందుకేస్తూ లక్ష్యాన్ని సాధించారు. తెలంగాణలో పసుపు బోర్డుకు ప్రధాని మోదీతో ప్రకటన చేయించిన అనంతరం ఇందూరులోనే ఏర్పాటు చేసేవరకు పట్టు వదలకుండా ముందుకెళ్లారు. 2024 ఏప్రిల్‌ 19న మొదటిసారి ‘సాక్షి’ దినపత్రిక ‘ఇందూరులోనే పసుపు బోర్డు’ కథనం ప్రచురించింది. అదేవిధంగా పసుపు బోర్డును మహారాష్ట్రకు తరలించుకుపోయేందుకు మహారాష్ట్రకు చెందిన కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయల్‌, నితిన్‌ గడ్కరీ ప్రయత్నా లు చేసినప్పుడు ఢిల్లీలో ఎంపీ అర్వింద్‌ మంత్రాంగం చేసిన విషయమై 2024 డిసెంబర్‌ 3న ‘సాక్షి’లో ‘పసుపు బోర్డు కోసం’ కథనం ప్రచురితమైంది. తాజాగా సంక్రాంతి కానుకగా ఎంపీ అర్వింద్‌ ఏకంగా జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌గా జిల్లాకు చెందిన సీనియర్‌ నేత పల్లె గంగారెడ్డిని నియమించేలా చక్రం తిప్పారు. మంగళవారం ఇందూరులోని స్పైసెస్‌ బోర్డు కార్యాలయంలో తాత్కాలికంగా పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీ అర్వింద్‌, బోర్డు చైర్మన్‌ పల్లె గంగారెడ్డి సహా జాతీయ స్పైస్‌ బోర్డు కార్యదర్శి పి హేమలత, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల జాయింట్‌ సెక్రెటరీ కెసంగ్‌ యంగ్జోమ్‌ హాజరు కానున్నారు.

● జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌గా పల్లె గంగారెడ్డి నియామకం నేపథ్యంలో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపైంది. మనదంతా బీజేపీ కుటుంబం.. మోదీ కుటుంబం అంటూ నినాదాలు చేస్తున్నారు. సుగంధ ద్రవ్యాల బోర్డు కింద ఉన్న పసుపు పంటను విడదీసి ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేస్తుండడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర తెలంగాణకు అంతర్జాతీయ ఖ్యాతి దక్కనుందని అంటున్నారు. గుంటూరులోని పొగాకు బోర్డు, కేరళ లోని కొచ్చిలోని సుగంధ ద్రవ్యాల బోర్డు మాదిరిగా ఇందూరు పసుపు బోర్డుకు ప్రాధాన్యం దక్కనుందని చెబుతున్నారు. చైర్మన్‌గా గంగారెడ్డిని నియమించిన కేంద్ర ప్రభుత్వం డైరెక్టర్లుగా ఐదుగురు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు, రైతులు, వ్యవసా య శాస్త్రవేత్తలు, ట్రేడర్లను నియమించేందుకు కసరత్తు చేస్తోంది. వ్యవసాయం, వాణిజ్యం, పరిశ్రమల శాఖలు, ఆయుష్‌, ఫార్మాసూటికల్స్‌ విభాగా ల నుంచి రొటేషన్‌ విధానంలో వివిధ రాష్ట్రాల నుంచి ప్రతినిధులను, పరిశోధనల్లో భాగసామ్యమయ్యే సంస్థలు, పసుపు రైతులు, ఎగుమతిదారుల ప్రతినిధులను సభ్యులుగా నియమించనున్నారు. పసుపు బోర్డు కార్యదర్శిని కేంద్ర వాణిజ్య శాఖ నియామకం చేయనుంది.

● పసుపు బోర్డు, రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటైతే జిల్లాకు పసుపు శుద్ధి కర్మాగారాలు తరలి వస్తాయి. ప్రైవేట్‌ స్టోరేజ్‌ కేంద్రాలు భారీగా ఏర్పాటవుతాయి. ప్రాసెసింగ్‌ యూనిట్లు వెలుస్తాయి. దీంతో పసుపు పంట కు అదనపు విలువ జోడించినట్లవుతుంది. అంత ర్జాతీయ ఎగుమతులకు వీలు కలుగుతుంది.

● భారతీయ రైతులు పండించిన పసుపు పంటకు అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్‌ ఉంది. ప్రతి ఏటా రూ.1,600 కోట్ల మేర పసుపు ఎగుమతులు జరుగుతున్నాయి. అంతర్జాతీయ పసుపు వాణిజ్యంలో భారత్‌ వాటా ప్రస్తుతం 62 శాతం ఉంది. ఎగుమతులను రూ.8,400 కోట్లకు పెంచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేస్తోంది. దీనికి పసుపు బోర్డు ఎంతగానో ఉపయోగపడనుంది. బోర్డు ఏర్పాటైతే రాష్ట్రంలో ఏటేటా తగ్గుతూ వస్తున్న పసుపు పంట విస్తీర్ణం మళ్లీ పెరిగే అవకా శం ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సా హం లభిస్తుంది. బోర్డు ఏర్పాటైతే జిల్లాకు పసుపు శుద్ధి కర్మాగారాలు, కర్క్యుమిన్‌ యూనిట్లు, కర్క్యుమిన్‌ ఆయిల్‌ ఎక్స్‌ట్రాక్ట్‌ ఎగుమతి యూనిట్లు, వివిధ పసుపు ఆధారిత పరిశ్రమలు తరలివస్తాయి. అమెరికా, యూఏఈ, బంగ్లాదేశ్‌, మలేషియా దేశాల్లో భారత పసుపునకు డిమాండ్‌ ఉంది. బోర్డు ద్వారా భారతదేశం నుంచి అంతర్జాతీయ పసుపు వాణిజ్యం మరింత విస్తృతమవుతుంది.

వంగడాల అభివృద్ధి నుంచి ప్రాసెసింగ్‌, ఎగుమతుల వరకు..

జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటైతే కొత్త వంగడాల అభివృద్ధి నుంచి పోస్ట్‌ హార్వెస్ట్‌ మేనేజ్‌మెంట్‌, మార్కెటింగ్‌ వరకు రైతులకు లబ్ధి కలుగుతుంది. అవసరాన్ని బట్టి పసుపు బోర్డు రైతులకు విత్తనం అందించి బైబ్యాక్‌ ఒప్పందం సైతం చేసుకుంటారు. రైతులకు రాయితీలు పెరుగుతాయి. పసుపు తవ్వకం, ఆరబెట్టడం, ఉడకబెట్టడం, డ్రై చేయడం, పాలిష్‌ చేయడానికి అవసరమైన యంత్రాలను రాయితీపై అందిస్తారు. కొత్త వంగడాల అభివృద్ధితో పాటు పసుపు పంట విత్తిన తరువాత అవసరమైన సైంటిఫిక్‌, సాంకేతిక పద్ధతులు అవలంబించే విషయంలో సలహాలు, సూచనలు ఇస్తారు. తద్వారా కర్క్యుమిన్‌ శాతం, నాణ్యత, దిగుబడి పెంచేలా రైతులకు సహకారం అందుతుంది. ఇక పసుపు పంట మార్కెటింగ్‌ కోసం అంతర్జాతీయ కంపెనీలను తీసుకువచ్చే బాధ్యత సైతం బోర్డు తీసుకుంటుంది.

ఇందూరుకే పసుపు బోర్డు

తీసుకొచ్చిన ఎంపీ అర్వింద్‌

బోర్డు చైర్మన్‌గా నియామకమైన

బీజేపీ సీనియర్‌ నేత పల్లె గంగారెడ్డి

నేడు స్పైసెస్‌ బోర్డులో తాత్కాలిక

కార్యాలయాన్ని వర్చువల్‌గా

ప్రారంభించనున్న కేంద్ర మంత్రి గోయల్‌

రానున్న జాతీయ పసుపు బోర్డు

కార్యదర్శి హేమలత

స్థానిక ఎన్నికల ముందు

కమలం శ్రేణుల్లో రెట్టించిన ఉత్సాహం

ముందే చెప్పిన ‘సాక్షి’ కథనాలు

No comments yet. Be the first to comment!
Add a comment
పట్టుబట్టి పసుపు బోర్డు1
1/3

పట్టుబట్టి పసుపు బోర్డు

పట్టుబట్టి పసుపు బోర్డు2
2/3

పట్టుబట్టి పసుపు బోర్డు

పట్టుబట్టి పసుపు బోర్డు3
3/3

పట్టుబట్టి పసుపు బోర్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement