గ్రూపుల గోల | Sakshi
Sakshi News home page

గ్రూపుల గోల

Published Fri, Apr 19 2024 1:25 AM

-

● వెనిగండ్లను వ్యతిరేకిస్తున్న టీడీపీ నేతలు ● టీడీపీ ప్రచారానికి స్పందన కరువు ● నిస్తేజంలో తెలుగు తమ్ముళ్లు ● మరోవైపు ప్రచారంలో దూసుకుపోతున్న కొడాలి నాని
గుడివాడ టీడీపీలో

గుడివాడ రూరల్‌: గుడివాడ టీడీపీ గ్రూపుల గోలతో సతమతమవుతోంది. రాజకీయాలకు కొత్త అయిన వెనిగండ్ల రాముకు టీడీపీ సీటు దక్కగా...ఆ టిక్కెట్‌ ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి రావి వెంకటేశ్వరరావు తీవ్రఅసంతృప్తితో ప్రచారంలో అంటీముట్టనట్లు ఉంటుండటంతో గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఓవైపు ఇప్పటికే నాలుగుసార్లు గెలిచిన ఊపుతో కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుండగా, మరోవైపు టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము ఎన్నికల ప్రచారానికి జనం స్పందన అంతంత మాత్రంగానే ఉండటం టీడీపీ దుస్థితికి అద్దం పడుతోంది. ఇటీవల గుడివాడ పట్టణంలో మచిలీపట్నం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరితో కలసి వెనిగండ్ల రాము నిర్వహించిన ప్రచార ర్యాలీలో పట్టుమని 50మంది కూడా లేకపోవడమే ఇందుకు నిదర్శనం. దీంతో ఎంపీ అభ్యర్థి వల్లభనేని సైతం అసహనం వ్యక్తంచేసినట్లు సమాచారం. ఎన్‌ఆర్‌ఐగా ఎన్నికల బరిలో దిగుతున్న వెనిగండ్ల రాము విచ్చలవిడిగా డబ్బు వెద జల్లుతూ ప్రచారానికి వచ్చేవారికి రోజువారీగా తగినమొత్తం ఇస్తామని చెబుతున్నప్పటికీ జనం రాకపోతుండటంతో టీడీపీ కేడర్‌ రోజురోజుకు డీలాపడుతోంది. కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నా గుడివాడలో పార్టీకి ఇంకా ఓ ఊపురావడం లేదని రాము వర్గీయులతోపాటు తెలుగుతమ్ముళు మథనపడుతున్నారు.

రావి వర్గీయుల నుంచి తీవ్ర వ్యతిరేకత....

గుడివాడ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు వర్గీయుల నుంచి టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాముకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వ్యాపారాలు వదిలేసి అధినేత ఆదేశాల మేరకు కోట్లు ఖర్చుచేసి పార్టీని నిలబెట్టిన రావికి సీటు ఇవ్వకుండా ఆర్థికంగా బలవంతుడైన ఎన్‌ఆర్‌ఐ వెనిగండ్ల రాముకు సీటు కేటాయించినప్పటీ నుంచి రావి వర్గీయులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. గుడివాడ, నందివాడ, గుడ్లవల్లేరు మండలాలతో పాటు పట్టణంలో కూడా రావికి బలమైన వర్గం ఉంది.అదేసమయంలో వెనిగండ్ల రాము, రావి వర్గానికి ప్రాధాన్యం ఇవ్వకపోతుండటంతో కూడా వారు దూరంగా ఉండటానికి మరో కారణమని చెప్పవచ్చు. ఇటీవల టీడీపీ ఎన్నికల కార్యాలయంలో రావి వర్గానికి చెందిన మైనార్టీ నాయకుడుపై నాయకులంతా చూస్తుండగానే వెనిగండ్ల వర్గానికి చెందిన ఓ మహిళ కుర్చీతో దాడిచేయడంపై రావి వర్గీయులు రగిలిపోతున్నారు. రావి కుటుంబానికి అత్యంత సన్నితంగా ఉండే బీసీ నాయకుడు దేవరపల్లి కోటి కూడా వెనిగండ్ల వర్గీయులతో ఇమడలేక వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సమక్షంలో ఇటీవల పార్టీలో చేరడం గమనార్హం.

ఒంటెద్దు పోకడలే కారణం..

టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాముకు కూటమి పార్టీలైన జనసేన, బీజేపీ నేతలతోనూ అంటీముట్టనట్లుగా ఉంటుండటంతో వారు కూడా ఆయనపై గుర్రుగా ఉన్నారు. జనసేనలో కేవలం ఒకరిద్దరికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ, మిగిలినవారిని పట్టించుకోకపోతుండటంతో ఆపార్టీ నాయకులు అసహనం వ్యక్తంచేస్తున్నారు. పార్టీలో దళితులకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఇటీవల జనసేన దళిత నేతలు ఆవేదన వ్యక్తంచేయడం గమనార్హం. బీజేపీ నాయకులను కూడా పట్టించుకోకపోతుండటంతో కూటమి అభ్యర్థి రాముతీరుపై వారు కూడా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఇలా ఒంటెద్దు పోకడల కారణంగానే కూటమి పార్టీల నాయకులు రాముకు దూరమవుతున్నారని రాజకీయవిశ్లేషకులు భావిస్తున్నారు.

దూసుకుపోతున్న కొడాలి..

ప్రతిష్టాత్మక గుడివాడ నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి కొడాలి నాని ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా కొడాలి నానికి నియోజకవర్గంపై గట్టిపట్టు ఉంది. సాయం కావాలని ఎవరూ వచ్చినా, వారికి సాయం చేసి నేను ఉన్నానంటూ ధైర్యం చెప్పడంతోపాటు వారికి అండగా నిలబడటం కొడాని నాని ప్రత్యేకత. ప్రజాసమస్యల పరిష్కారానికి తనదైనశైలిలో కృషిచేస్తూ, ప్రజలకు అండగా ఉంటుండటంతో ఎన్నికల ప్రచారంలో ఏవార్డు..గ్రామానికి వెళ్లినా ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. అదేవిధంగా గుడివాడ, నందివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో కూడా ఎమ్మెల్యే కొడాలి నానికి మద్దతుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గుడివాడలో ఇటీవల సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన మేమంతా సిద్ధం సభతో వైఎస్సార్‌ సీపీ శ్రేణులు మరింత రెట్టింపు ఉత్సాహంతో ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈ ఐదేళ్లలో గుడివాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొడాలి నాని చేసిన అభివృద్ధి, సంక్షేమం ఆయన విజయానికి దోహదపడతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. గత 20ఏళ్లుగా ప్రజాబలంతో అప్రతిహతంగా వరుస విజయాలు సాధిస్తున్న ఎమ్మెల్యే కొడాలి నానితో తలపడే విషయంలో టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోతున్నారని టీడీపీ నాయకులే గుసగుసలాడుకుంటుండటం గమనార్హం.

Advertisement

తప్పక చదవండి

Advertisement