వైద్యానికి గ్రహణం
లబ్బీపేట(విజయవాడతూర్పు): గతంలో పేదలకు అందే అత్యుత్తమ వైద్య సేవలు పడకేశాయి. వైద్య ఆరోగ్య రంగానికి గ్రహణం పట్టింది. పురిటి నొప్పులు వచ్చినా.. ప్రమాదంలో గాయాలు, ఇతర అనారోగ్యానికి గురైనప్పుడు ఒక్క ఫోన్ కాల్ చేస్తే కుయ్.. కుయ్..కుయ్ అంటూ వచ్చే 108 వాహనాలు కుయ్యో..మొర్రో అంటున్నాయి. ప్రతి పదిహేను రోజులకూ గ్రామానికి వచ్చి వైద్య సేవలు అందించే 104 వాహనాలు పడకేశాయి. దీంతో వైద్యం సేవల కోసం పేదలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అప్పుచేసి పట్టణాల్లో ఉన్న పెద్దాస్పత్రిలకు పరుగులు పెట్టాల్సి వస్తుంది. సేవలను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం తామేదో గొప్పగా సేవలు అందిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటోంది.
కదల్లేని ‘108’ వాహనాలు
ఎన్టీఆర్ జిల్లాలో24, కృష్ణా జిల్లాలో 29.. ‘108’ వాహనాలు ఉన్నాయి. ఇవి కొంత కాలంగా మరమ్మతులకు గురవుతున్నాయి. దీంతో కుయ్..కుయ్..కుయ్ అంటూ క్షతగాత్రులు, రోగులను వేగంగా ఆస్పత్రిలకు తీసుకెళ్లాల్సిన వాహనాలు కదల్లేని పరిస్థితిలో ఉన్నాయి. ఒక్కోరోజు డీజిల్‌కు సైతం డబ్బులు లేక వాహనాలు నిలిపివేసిన సందర్భాలున్నాయి. వాటిలో పనిచేసే డ్రైవర్లు, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్(ఈఎంటీ)లకు నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. దీంతో ఈ నెల 25 నుంచి సమ్మెకు దిగుతామంటూ ఉద్యోగుల సంఘ నేతలు ఇప్పటికే జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులకు నోటీసులు అందజేశారు. తమకు పెండింగ్ జీతాలు చెల్లించడంతో పాటు, వాహనాల మరమ్మతులు, డీజిల్ కొరత లేకుండా చూడాలని సిబ్బంది కోరుతున్నారు.
కొనసాగని సేవలు
మారుమూల గ్రామాలకు ‘కుటుంబ డాక్టర్’ ద్వారా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వెళ్లి వైద్య సేవలు అందించిన 104 వాహనాల సేవలు పడకేశాయి. గతంలో ప్రతి గ్రామాన్ని మ్యాపింగ్ చేసి, ఎంపిక చేసిన తేదీల్లో కచ్చితంగా వైద్యులు, సిబ్బంది వెళ్లి సేవలు అందించేవారు. నడవలేని స్థితిలో మంచాన ఉన్న రోగుల ఇళ్లకే వెళ్లి వైద్యులు చూసేవారు. పాఠశాలలకు, అంగన్‌వాడీలకు వెళ్లి పరిశుభ్రతపై అవగాహన కలిగించేవారు. ఇప్పుడు అలాంటి కార్యక్రమాలు ఏవీ కొనసాగడం లేదు. ఏ గ్రామానికి ఎప్పుడు వైద్యులు వెళ్తారో కూడా మ్యాపింగ్ అమలు కావడం లేదు.
నిలిచిన వైద్యం
ఒకప్పుడు ఫీవర్ సర్వే, క్రానిక్ డిసీజెస్ (దీర్ఘకాలిక వ్యాధుల) గుర్తింపు కార్యక్రమం పక్కాగా జరిగేది. అంతేకాదు జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలను నిర్వహించి, వ్యాధులతో భాదపడుతున్న వారిని గుర్తించి, వైద్య సేవలు అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రిల్లో చేర్చి చికిత్స అందించేవారు. ఇప్పుడు ఏవీ కొనసాగడం లేదు. దీంతో ఈ ఏడాది డెంగ్యూ, డయేరియా విజృంభించాయి. పలువురు మృత్యువాత కూడా పడ్డారు. గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కార్యక్రమాలు నిలుపు చేయడంతో ఇలా జరిగినట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు.
కుయ్యో.. మొర్రో అంటున్న 108 వాహనాలు పడకేసిన ‘104’ సేవలు దీర్ఘకాలిక రోగుల ఇక్కట్లు
దీర్ఘకాలిక రోగుల ఇబ్బందులు
ఆరోగ్య కార్యక్రమాలు సక్రమంగా కొనసాగక పోవడంతో దీర్ఘకాలిక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో రక్తపోటు, మధుమేహం, హైపో థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక రోగులను గుర్తించి, వారిని 104 సేవలకు మ్యాపింగ్ చేసేవారు. ఆ గ్రామానికి వెళ్లినప్పుడు క్రమం తప్పకుండా మందులు వాడేలా చూసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు మందుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు పీహెచ్‌సీల దారి పడుతుండగా, మరికొందరు విజయవాడలోని పెద్దాస్పత్రికి వస్తున్నారు.
వైద్య రంగాన్ని విస్మరించకూడదు
ప్రజలకు కావాల్సింది విద్య, వైద్యం. ఈ రెండు రంగాలను ఏ ప్రభుత్వాలు విస్మరించకూడదు. వైద్య ఖర్చులు భరించలేకనే నేడు ఎంతో మంది ప్రజలు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వాస్పత్రులతో పాటు, గ్రామీణ వైద్యాన్ని కూడా మరింత మెరుగుపర్చాలి. ఆరోగ్య కార్యక్రమాలను నిరాటంకంగా కొనసాగించాలి. ఎంతో మంది ప్రాణాలు నిలిపిన 108 సేవలు నిలవకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
– మునీర్ అహ్మద్ షేక్, కన్వీనర్, ముస్లిం జేఏసీ
Comments
Please login to add a commentAdd a comment