లీజెస్ విభాగంలో లొసుగులు!
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థాన టెండర్ల విభాగంలో లొసుగులు బయట పడుతున్నాయి. దేవస్థానంలోని కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరు అమ్మవారి ఆదాయానికి గండి కొడుతున్నాయి. టెండర్ల గడువు ముగిసినా దుకాణాలను స్వాధీనం చేసుకోవడంలో అధికారులు అలసత్వం చూపుతుండటంతో దేవస్థానం లక్షలాది రూపాయల ఆదాయాన్ని కోల్పోతున్న వ్యవహారం ఆదివారం వెలుగులోకి వచ్చింది. దుర్గగుడి ఈవో కె.ఎస్.రామరావు రెండు రోజులుగా లీజెస్ సెక్షన్ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. దేవస్థానానికి చెందిన కనకదుర్గనగర్‌లోని స్థలంలో మొబైల్ క్యాంటిన్ నిర్వహించడనాఇకి విశాఖపట్నంకు చెందిన కాంట్రాక్టర్‌కు టెండర్ కేటాయించారు. గడువు విషయంలో చోటు చేసుకున్న అలసత్వం ఇప్పుడు దేవస్థానానికి కొత్త చిక్కులు తెచ్చి పెట్టడమే కాకుండా కాంట్రాక్టర్ నుంచి డబ్బులు వసూలు చేయకుండా మీనమేషాలు లెక్కించడంపై ఈవో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో కొంత మంది ఏఈవోలు కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. కనకదుర్గనగర్‌లోని మొబైల్ క్యాంటిన్ టెండర్ గడువు ముగిసినా ఆయా సెక్షన్ అధికారులు సదరు ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోలేదు. ఈ వ్యవహారంలో దేవస్థాన అధికారుల తప్పులు వెలుగులోకి రాకుండా ఉండేందుకు వేలం ప్రక్రియను రెండేళ్ల నుంచి మూడేళ్లకు పెంచినట్లు రికార్డులు తయారు చేశారు. ప్రతి టెండర్ కేటాయింపునకు ముందుగానే డబ్బులు వసూలు చేయాల్సి ఉండగా, దేవస్థాన అధికారులు ఆ నిబంధనను తుంగలోకి తొక్కారు. దేవస్థానానికి రావాల్సిన సుమారు రూ. 15 లక్షల మేర వసూలు చేయడంలోనూ ఆలయ అధికారులు అలసత్వం చూపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తుండగా, సదరు వ్యవహారంపై కాంట్రాక్టర్ కోర్టును ఆశ్రయించగా, ఇప్పుడు ఆలయ అధికారులు విషయాన్ని కోర్టు ద్వారా తేల్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
దుర్గగుడి ఈవో సమీక్షతో బట్టబయలు డబ్బులు వసూలు చేయడంలో అలసత్వం
Comments
Please login to add a commentAdd a comment