వనసమారాధనలతో ఐకమత్యం పెంపు
నున్న(విజయవాడరూరల్): కార్తిక వనసమారాధనలతో ఐకమత్యం పెరుగుతుందని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ వి.ఆర్.కె.కృపాసాగర్ అన్నారు. విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో విజయవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యాన జరిగిన కార్తిక వన సమారాధనలో జస్టిస్ కృపాసాగర్ పాల్గొన్నారు. తొలుత ఉసిరి చెట్టుకు పూజలు చేశారు. న్యాయవాదుల కుటుంబాల సభ్యులు అందరూ ఒకే చోట కలుసుకునేలా బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తిక వనసమారాధన నిర్వహించడం సంతోషమన్నారు. కార్యక్రమంలో జిల్లాలోని పలువురు జడ్జిలు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఘనంగా శాంతి కల్యాణం
పెనమలూరు:యనమలకుదురులోని పార్వతీ సమేత శ్రీరామలింగేశ్వరస్వామి దేవస్థానంలో ఆదివారం శాంతి కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. తొలుత ఆలయంలో మహా రుద్రహోమం చేశారు. అనంతరం మహా శాంతిహోమం జరిగింది. మూల విగ్రహాలకు అష్ట బంధ సమర్పణ అనంతరం ఆలయంలో శాంతి కల్యాణం చేశారు. ఆలయ నిర్మాణ దాత సంగా నరసింహారావు, భక్తులు పెద్ద సంఖ్యలో పూజలు చేశారు. ఆలయంలో సోమవారం అష్టబంధన మహా కుంభాభిషేకం ఉదయం 8.30 గంటలకు శ్రీవిధుశేఖర భారతీ సన్నిధానం అమృత హస్తాలతో ఘనంగా చేస్తారని ఆలయ ఈఓ ఎన్.భవాని తెలిపారు.
స్వామివారికి వెండి
నాగపడగ సమర్పణ
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి జిల్లా కొత్తగూడెం వాస్తవ్యులు గొడిశీల కల్యాణ్ శేఖర్ స్వామివారికి వెండి నాగ పడగను సమర్పించుకున్నారు. ఆదివారం ఉదయం స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఒక కిలో బరువున్న వెండి నాగపడగను ఆలయ అధికారులకు అందజేశారు. దాత కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో సత్కరించారు. అధికారులు బర్మా ప్రసాద్, కిషోర్, దాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
దుర్గమ్మకు బంగారు కాసులపేరు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు విజయవాడకు చెందిన భక్తులు ఆదివారం బంగారు కాసుల పేరును కానుకగా సమర్పించారు. గొల్లపూడికి చెందిన ఎ.సూరిబాబు కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి 65 గ్రాముల బంగారంతో తయారు చేయించిన బంగారు కాసుల పేరును అందజేశారు. అనంతరం దాతలకు అమ్మవారి దర్శనం కల్పించిన ఆలయ అధికారులు, వేద పండితుల ఆశీర్వచనాలు అందించారు.
విధుశేఖర మహాస్వామికి ఘనస్వాగతం
విజయవాడ కల్చరల్: శృంగేరీ పీఠం ఉత్తరాధికారి విధేశేఖర భారతీస్వామి విజయయాత్రలో భాగంగా ఆదివారం స్వామికి నగరంలో ఘన స్వాగతం లభించింది. వేదపండితులు స్వామీజీకి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దేవాలయ పాలక వర్గం స్వామి వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రథంమీద ఊరేగింపుగా తీసుకొని వచ్చారు. ధర్మాధికారి దంపతులు స్వామీజీ పాద పూజ చేశారు. శతావధాని గన్నవరపు లలిత్ ప్రసాద్ స్వాగత పత్రం సమర్పించారు. మూడు కోట్లతో నిర్మితమైన శారదాసదనం, ధార్మిక భవనాలను స్వామిజీ ప్రారంభించారు. పీఠం సంప్రదాయాన్ని అనుసరించి స్వామి శారదా చంద్రమౌళీశ్వర్లు పూజను నిర్వహించారు. స్వామీజీ అనుగ్రహ భాషణం చేస్తూ సనాతన ధర్మం విశిష్టమైనదన్నారు. ధర్మరక్షణకు పీఠం కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో జొన్నవిత్తుల ప్రభాకర శాస్త్రి, గండూరి చంద్రమౌళీశ్వర శర్మ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment