వసతి గృహాల్లో సమస్యల తిష్ట
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లు సమస్యలకు నిలయాలుగా మారాయి. వీటిని దశాబ్దాల క్రితం నిర్మించడంతో శిథిలావస్థకు చేరి కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్‌జిల్లాలోని వివిధ యాజమాన్యాల్లో 68 వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో సాంఘిక సంక్షేమ వసతి గృహాలు 33, వెనుకబడిన తరగతుల సంక్షేమ హాస్టల్స్ 27, గిరిజన సంక్షేమ శాఖ హాస్టల్స్ 8(గిరిజన రెసిడెన్షియల్ స్కూల్స్‌తో కలుపుకుని) ఉన్నాయి. వీటన్నింటిలో కలిపి 6,551 మంది బాలబాలికలు వసతి పొందుతున్నారు. చాలా వరకు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి.
జగ్గయ్యపేటలో..
‘పేట’లోని ఇంటిగ్రేటెడ్ బాలికల హాస్టల్‌లో 200 మంది వసతి పొందుతున్నారు. వసతి గృహానికి ప్రహరీ లేదు. స్థానిక బోర్ వాటర్‌నే వినియోగిస్తున్నారు. 20 మరుగుదొడ్లు ఉంటే వీటిలో పది మాత్రమే వినియోగంలో ఉన్నాయి. వీటికి తలుపులు కూడా సరిగా లేవు. భవనానికి సమీపంలో దీపాలు లేక ఆవరణ చీకటిగా ఉంటుంది. ఈ ఏడాది ప్రభుత్వం బెడ్ షీట్‌లు, కార్పెట్‌లు ఇవ్వలేదు. శానిటరీ నాప్కిన్స్ కాల్చేందుకు మిషన్ ఏర్పాటు చేయలేదు. బాలికల గదికి తలుపులు లేవు. డైట్ బిల్లుల బడ్జెట్ విడుదల కాలేదు.
తిరువూరులో..
తిరువూరులో మొత్తం 7 వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో ఒకటి మినహా మిగిలినవి అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. తిరువూరు బస్టాండు సెంటర్‌లో శిథిలమైన ప్రైవేటు భవనంలో బాలికల స్పెషల్ హాస్టల్ నిర్వహిస్తున్నారు. 80 మంది విద్యార్థులకు 5 మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి. పాతతిరువూరులోని బీసీ బాలుర వసతిగృహం శిథిలం కావడంతో ప్రైవేటు భవనంలోకి మార్చారు. గంపలగూడెంలో సమీకృత సంక్షేమ వసతిగృహంలో 400 మందికి 108 మంది మాత్రమే చేరారు. సోమవారం ‘సాక్షి’ విజిట్ చేసిన సమయంలో 40 మంది మాత్రమే ఉన్నారు. ఈ హాస్టల్ పక్కాభవనం కింది ఫ్లోర్ చెదలు పట్టి తలుపులు, కిటికీలు పూర్తిగా పాడయ్యాయి. పై ఫ్లోర్‌కు కూడా చెదలు వ్యాపిస్తున్నాయి. మరుగుదొడ్లకు తలుపులు లేవు. 8, 9 తరగతుల్లో విద్యార్థులకు 25 మందికి ఇంకా దుప్పట్లు ఇవ్వలేదు. విస్సన్నపేట ఎస్సీ బాలికల వసతి గృహంలో 34 మంది కళాశాల విద్యార్థినులు, పాఠశాల వసతిగృహంలో 35 మంది విద్యార్థినులు ఉన్నారు. పురాతన భవనంలో హాస్టల్ నిర్వహిస్తున్నారు. ఏ కొండూరు మండలంలోని కంభంపాడులో సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం ఉంది. 36 మంది విద్యార్థులకు 14 మంది మాత్రమే సోమవారం హాజరయ్యారు. ప్రహరీ లేకపోవడంతో ప్రాంగణంలోకి కుక్కలు వస్తున్నాయి. మరుగుదొడ్లకు తలుపులు లేవు. కిటికీలకు మెష్‌లు లేవు.
మైలవరంలో...
మైలవరం మండలంలో ఎస్సీ బాలురు, ఎస్సీ బాలికలు, బీసీ బాలురు, గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల ఉన్నాయి. హాస్టల్‌కు తాగు నీటి సమస్య ఉంది. టాయిలెట్స్ సమస్య ఉంది. కొండపల్లిలో ఏపీ మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయంలో 405మంది విద్యార్థులు ఉన్నారు. 18 ఇరుకు గదుల్లో సర్దుకుంటున్నారు. టాయిలెట్లను నాడు నేడు పథకంలో అభివృద్ధి చేసినా కొన్నింటికి డోర్లు పగిలి ఉన్నాయి. జి.కొండూరు మండలం కుంటముక్కల గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో 156 మంది ఇంటర్, పాఠశాలకు 493మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి 64 బాత్రూమ్‌లు ఉండగా 38 మాత్రమే పని చేస్తున్నాయి. భవనం శిథిలావస్థకు చేరింది. కొంతకాలం క్రితం వచ్చిన వరదల్లో ప్రహరీ కూలిపోయింది.
విజయవాడ సెంట్రల్..
ప్రకాష్‌నగర్ సాంఘిక సంక్షేమ వసతి గృహంలో మొత్తం 67 మంది వసతి పొందుతున్నారు. భవనం శ్లాబు పెచ్చులూడుతోంది. దుప్పట్లు,బెడ్‌షీట్లు, పుస్తకాలు అందచేయలేదు. మరుగుదొడ్లకు నీటి సదుపాయం లేదు. పాయకాపురంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో 105 మంది విద్యార్థులు ఉన్నారు. కాస్మెటిక్ చార్జీలు అందలేదు. టాయిలెట్స్ సమస్య ఉంది. ప్రహరీ లేదు. సీసీ కెమెరాలు లేవు.
● ప్రభుత్వ దివ్యాంగుల హాస్టల్‌లో 30 మంది ఉన్నారు. దుప్పట్లు, కార్పెట్ అందలేదు. మరుగుదొడ్లు డోర్లు పగిలిపోయాయి. మొదటి అంతస్తులో శ్లాబు దెబ్బతిని వర్షం పడితే కారుతోంది.
విజయవాడ పశ్చిమంలో..
భవానీపురంలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో 63 మంది వసతి పొందుతున్నారు. భవనం పాతది. ఇటీవల రోడ్లు వేయడంతో హాస్టల్ భవనం పల్లమైంది. ప్రహరీ ఎత్తు పెంచాల్సి ఉంది. ఫెన్సింగ్, సీసీ కెమెరాలు లేవు.
మరుగుదొడ్లకు తలుపులు లేవు పెచ్చులూడుతున్న శ్లాబులు బాలికల హాస్టల్స్‌కు సీసీ కెమెరాలు, ప్రహరీకి ఫెన్సింగ్ లేదు
బడ్జెట్ విడుదల కాలేదు
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత విద్యార్థులకు కాస్మెటిక్ చార్జీలు, డైట్‌కు బడ్జెట్ విడుదల కాలేదు. జూన్‌లో పాఠశాలలు ప్రారంభం కావడంతో హాస్టల్‌లో విద్యార్థులు చేరారు. వీరికి తరగతులను బట్టి రూ.1150, రూ. 1400, రూ.1600 చొప్పున మెస్ చార్జీలు చెల్లిస్తారు. జిల్లాలో కేవలం నాలుగు హాస్టల్స్‌కు మాత్రమే మొదటి త్రైమాసికానికి బడ్జెట్ విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment