దుర్గమ్మ సేవలో శివాచార్య మహాస్వామి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను శ్రీశైల జగద్గురు శ్రీ 1008 చెన్న సిద్దరాం పండితారాధ్య శివాచార్య మహాస్వామి బుధవారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆశీర్వచన మండపంలో పండితులు వేదస్వస్తి పలికారు. ఆలయ ఈవో కె.ఎస్.రామరావు, వైదిక కమిటీ సభ్యులు రంగావజ్జుల శ్రీనివాసశాస్త్రి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.
డిసెంబర్ 15 వరకు ‘బ్రూసెల్లోసిస్ టీకా’
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆడ పశువుల్లో గర్భస్రావానికి, మగ పశువుల్లో కీళ్ల వాపులు, వంధ్యత్వానికి కారణమయ్యే బ్రూసెల్లోసిస్ వ్యాధి నియంత్రణకు డిసెంబర్ 15 వరకు బ్రూసెల్లోసిస్ టీకా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ఎన్టీఆర్ ఇన్‌చార్జి కలెక్టర్ డాక్టర్ నిధి మీనా.. పశు సంవర్ధక శాఖ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాయింట్ డైరెక్టర్ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ పశువుల నుంచి మనుషులకు సోకే గుణం ఈ వ్యాధికి ఉందని.. పశు వ్యాధుల నియంత్రణ ద్వారా 4 నుంచి 8 నెలల వయసు ఆడ దూడలకు టీకా వేస్తారన్నారు. ఒకసారి టీకా వేస్తే జీవితంలో మరెప్పుడూ వ్యాధి రాదని పేర్కొన్నారు. పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డివిజనల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ గోపీచంద్, సీడీవో వెంకటేశ్వరరావు, డాక్టర్ మనోజ్, జిల్లా వ్యవసాయ అధికారి విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ టెన్నిస్ జట్టు ఎంపిక
విజయవాడస్పోర్ట్స్: డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ టెన్నిస్ పురుషుల జట్టును ఎంపిక చేసినట్లు వర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ డాక్టర్ ఇ.త్రిమూర్తి తెలిపారు. ఇటీవల నిర్వహించిన ఎంపిక పోటీల్లో అత్యంత క్రీడా నైపుణ్యం ప్రదర్శించిన వి.రాకేష్ వెంకటేశ్వరచౌదరి (జీఎస్‌ఎల్ కళాశాల, రాజమండ్రి), జి.విష్ణుసాహిత్ (జీఎస్‌ఎల్ వైద్య కళాశాల, రాజమండ్రి), సి.హెచ్.ప్రభవ్ (ప్రభుత్వ వైద్య కళాశాల, శ్రీకాకుళం), సి.హెచ్.జనార్దన్ సాగర్ (సిద్ధార్థ వైద్య కళాశాల, విజయవాడ), ఎం.శివకుమార్(ఎన్‌ఆర్‌ఐ వైద్య కళాశాల, చినకాకాని) జట్టులో చోటు దక్కించుకున్నారన్నారు. ఈ నెల 22 నుంచి 26వ తేదీ వరకు తిరువనంతపురంలోని యూనివర్సిటీ ఆఫ్ కేరళలో జరిగే సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో ఈ జట్టు పాల్గొంటుందన్నారు.
రైతులకు ఇచ్చిన హామీలు అమలుచేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని రైతు, కౌలు రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. రైతులకు తక్షణమే సాగుసాయం అందించాలని, అతివృష్టి, అనావృష్టి కారణంగా నష్టపోయిన రైతులు, కౌలురైతులు తీసుకున్న ఖరీఫ్ పంట రుణాలను మాఫీ చేయాలని, తక్షణమే కౌలురైతుల రక్షణ, సంక్షేమం కోసం సమగ్రమైన కౌలు చట్టం తీసుకురావాలి వంటి డిమాండ్ల సాధనకు ఏపీ రైతుసంఘం పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా బుధవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో డీఆర్వోకు ఏపీ కౌలురైతుల సంఘం, రైతు సంఘాల ప్రతినిధుల బృందం వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి పి. జమలయ్య, ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్నీడు యలమందారావు, నేతలు చెరుకూరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment