బాలికల బంగరు భవితకు పునాది
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కిశోరి వికాసం–2 బాలికల బంగారు భవిష్యత్తుకు పునాది వేస్తుందని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ డాక్టర్ నిధి మీనా అన్నారు. కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో బుధవారం కిశోరి వికాసం–2 కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనిపై క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. కిశోరి వికాసం పోస్టర్లను ఆవిష్కరించి, ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా నిధిమీనా మాట్లాడుతూ కిశోరి వికాసం పునఃప్రారంభం బాలికలకుమంచి అవకాశమని పేర్కొన్నారు. 11 నుంచి 18 ఏళ్ల బాలికలకు విద్య, ఆరోగ్యం, భద్రత, ఆర్థిక స్వావలంబన మెరుగుపరచడం ఈ కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు. దీనికి గ్రామాల్లో ప్రతి బాలికల సంఘాలను ఏర్పాటుచేసి.. అవగాహన కల్పించి, సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు తెలిపారు. బాలికల కోసం ఆత్మరక్షణ శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడం, డిజిటల్ భద్రత, సైబర్ క్రైం, ఆన్‌లైన్ వేదికలపై జాగ్రత్తగా ఉండేలా అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు.
సరైన విజ్ఞానం అందించాలి
జిల్లా న్యాయ సేవల అథారిటీ (డీఎల్‌ఎస్‌ఏ) సెక్రటరీ రామకృష్ణ మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాలు.. ప్రపంచానికి సవాళ్లుగా నిలుస్తున్నాయని.. వీటిని అరికట్టేందుకు సరైన అవగాహనతో సమష్టి కృషి అవసరమన్నారు. పటిష్ట భాగస్వామ్యంతో బాలికల ఎదుగుదలకు తోడ్పడుదామన్నారు. బాల్య వివాహ నిషేధ చట్టం–2006, బాలల లైంగిక దాడి నుంచి రక్షణ చట్టం (పోక్సో) –2012 తదితరాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా మహిళా, శిశు అభివృద్ధి అధికారి జి.ఉమాదేవి, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, ఇంటర్మీడియెట్ విద్య అధికారి సి.శివ సత్యనారాయణరెడ్డి, మార్పు ట్రస్ట్ ఆర్.సూయజ్, స్కిల్ డెవలప్‌మెంట్ జెడ్‌డీఎం సుమలత, యోగా ట్రైనర్ శిరీష, డెప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ ఇందుమతి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ నిధిమీనా
Comments
Please login to add a commentAdd a comment