ఆదివాసీల అణచివేతను ఖండించాలి
విజయవాడ సదస్సులో వక్తల పిలుపు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆదివాసీలు, గిరిజనులపై జరుగుతున్న అణచివేతను ఖండించాలని వక్తలు పిలుపునిచ్చారు. మంగళవారం విజయవాడ గాంధీనగర్‌లోని హనుమంతరాయ గ్రంథాలయంలో ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఉభయ తెలుగు రాష్ట్రాల కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ‘ఆదివాసీలు –హక్కులు–భారత రాజ్యాంగం‘ అనే అంశంపై సదస్సు జరిగింది. పాల్గొన్న మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ దేశంలోని సహజ సంపదను అదానీ, అంబానీలకు దోచిపెట్టేందుకు ఆదివాసీలను అణచివేస్తున్నారన్నారు. అభివృద్ధిలో ఆదివాసీలకు వాటా దక్కడం లేదన్నారు. విరసం నాయకుడు పాణి మాట్లాడుతూ మూలవాసీ బచావో నిషేధం విధించడానికి గల కారణాలను బహిర్గతం చేయాలన్నారు.
ఏపీ సీఎల్‌సీ కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్ మాట్లాడుతూ దండకారణ్యంలో ఆదివాసీలపై జరుగుతున్న అణచివేత, మానవ హక్కుల హననాన్ని వివరించారు. నిర్భంధాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం నాయకులు ముక్తి సత్యం, ఎస్ డానీ, సిద్ధార్థ దొర మాట్లాడుతూ అదానీ, అంబానీల కోసం ఆదివాసీల చట్టాలకు సవరణలు చేస్తున్నారన్నారు. ఖనిజ సంపదను దోచిపెట్టేందుకే చట్టాలు అనుకూలంగా సవరించుకుంటున్నారన్నారు. సదస్సులో ఏపీసీఎల్‌సీ ఉపాధ్యక్షుడు టి.ఆంజనేయులు, సి.భాస్కరావు(ఆలిండియా ఓ.పి.డి.ఆర్ అధ్యక్షుడు) చిట్టి బాబు (సి.ఎల్.సి.ఎ.పి), బాబు (ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ కమిటీ), రాధ(సి.ఎం.ఎస్), లక్ష్మణ్ (సి.ఎల్.సి.టి.ఎస్), హనుమంతరావు (ఓ.పి.డి.ఆర్), రోహిత్ (హెచ్.ఆర్.ఎఫ్) తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment