రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వీరాంజనేయ స్వామి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎస్సీ సంక్షేమ పథకాలన్నీ అర్హులైన వారికి అందిస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. విజయవాడ నాల్గో డివిజన్ వరలక్ష్మి నగర్‌లో రూ.80 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ హాలును మంత్రి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో ప్రారంభించిన కమ్యూనిటీ హాల్స్‌ను జనరల్ నిధులతో పూర్తి చేసి ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ హాల్స్‌ను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. త్వరలోనే రాష్ట్రంలోని క్రిస్టియన్స్ అందరికీ క్రిస్మస్ కానుక అందిస్తామన్నారు. అంబేడ్కర్ విదేశీ విద్యా దీవెన పథకాన్ని పునరుద్ధరిస్తామన్నారు. రాష్ట్రంలో రూ.340 కోట్లతో ప్రభుత్వ సంక్షేమ నూతన వసతి గృహాలను నిర్మిస్తామన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా డిసెంబర్, జనవరి నెలలోనే రుణాలు అందిస్తామన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment