దీక్ష విరమణ ఏర్పాట్లపై ఈవో సమీక్ష
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): భవానీ దీక్ష విరమణ ఏర్పాట్లపై ఆలయ ఈవో కె.ఎస్.రామరావు గురువారం ఆలయానికి చెందిన వివిధ విభాగాల అధికారులు, అర్చకులు, వేద పండితులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మహా మండపం ఆరో అంతస్తులో నిర్వహించిన సమీక్ష సమావేశానికి ఆలయ ఈవో రామరావుతో పాటు ఈఈలు కె.వి.ఎస్. కోటేశ్వరరావు, టి.వైకుంఠరావు, ఏఈవోలు, సూపరింటెండెంట్లు, ఆలయ వైదిక కమిటీ సభ్యులు, అర్చకులు, వేద పండితులు హాజరయ్యారు. దీక్ష విరమణలకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భవానీలు తరలిరానున్నారని తెలిపారు. వారికి ఎటువంటి ఇబ్బంది కలుగకుండా అన్ని విభాగాలు ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు ఏమైనా లోటుపాట్లు ఎదురయితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించాలన్నారు. గతంలో ఎదురైన లోటుపాట్లు ఈ ఏడాది పునరావృతం కాకుండా చూడాలని సూచించారు. ముఖ్యంగా అమ్మవారి దర్శనం, ఇరుముడి పాయింట్లు, హోమగుండాలు, అన్న ప్రసాదం, లడ్డూ ప్రసాదాలను పర్యవేక్షించే వారు 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భవానీలందరికీ అన్ని క్యూలైన్లలో ఉచిత దర్శనం కల్పిస్తున్నామని, వారికి క్యూలైన్లలో మంచినీరు, పబ్లిక్ అనౌన్స్‌మెంట్ వ్యవస్థ పటిష్టంగా ఉండాలని ఆదేశించారు. ఈ నెల 21 నుంచి 28వ తేదీ వరకు ఆలయంలో అన్ని ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నామని, భక్తులకు ఈ సమాచారం చేరేలా చూడాలన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్‌లో అన్ని శాఖల అధికారులు మూడు షిఫ్టులలో అందుబాటులో ఉంటారని, డ్యూటీ పాయింట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని డీఈవో రత్నరాజు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment