ఎర్ర బంగారం కరుణించేనా..!
● మిర్చి ధరపై రైతుల కొండంత ఆశ ● ఈ ఏడాది బాగా తగ్గిన మిర్చి ధర ● జిల్లాలో 13,500 హెక్టార్లలో సాగు
పెనుగంచిప్రోలు: గత రెండేళ్లుగా మంచి ధరలతో మిర్చి పంట రైతులకు లాభాలు తెచ్చిపెట్టింది. ఈ ఏడాది మొక్క దశలో వర్షాలకు రైతులు కొంత నష్టపోయినా దిగుబడులు, ధరలపై ఆశలు పెట్టుకున్నారు. ఎకరానికి 12 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని భావిస్తున్నారు. గత సీజన్‌లో లాగా ధరలు వస్తే బాగుంటుందని రైతులు భావిస్తున్నారు.
గతంతో పోల్చుకుంటే బాగా తగ్గిన మిర్చి ధర
గతంతో పోలిస్తే మిర్చి ధరలు ప్రస్తుతం చాలా దారుణంగా ఉన్నాయి. గత సీజన్‌లో క్వింటా మిర్చి ఏ రకమైనా రూ.20 వేల నుంచి రూ.24 వేల వరకు పలికింది. చాలామంది రైతులు మిర్చి పంటకు మంచి ధర వస్తుందనే ఆశతో కోల్డ్ స్టోరేజిల్లో నిల్వ చేశారు. ప్రస్తుతం తేజ మొదటి రకం క్వింటా రూ.16 వేలు కాగా మీడియం రకాలు రూ.12 వేలు, 334 రకం క్వింటా మొదటి రకం రూ.14 వేలు కాగా, మీడియం రకాలు రూ.11 వేలు ఉన్నాయి. నంబర్–5 రకాలు మొదటి రకం రూ.13 వేలు, మీడియం రకాలు రూ.9 వేల నుంచి రూ.10 వేలు, ఆర్మూర్ రకాలు మొదటి రకం రూ.12 వేలు, మీడియం రూ.9 వేలు ఉన్నాయి. శీతల గిడ్డంగుల్లో కొన్ని రకాలు మరీ దారుణంగా కొంటున్నారని రైతులు అంటున్నారు.
తగ్గిన విస్తీర్ణం...
గతంతో పోలిస్తే మిర్చి సాగు విస్తీర్ణం కూడా తగ్గింది. ధరలు బాగుండటంతో వరుసగా రెండేళ్లుగా 18,300 హెక్టార్లు, 19 వేల హెక్టార్లకు పైగా ఉన్న సాగు ఈ ఏడాది ఎన్టీఆర్ జిల్లాలో 13,500 హెక్టార్లలో మాత్రమే సాగయింది. మిర్చి ధర తగ్గటంతో పాటు సాగునీటి వనరుల సమస్య, ప్రకృతి సహకరించకపోవటం వంటి కారణాలు సాగు విస్తీర్ణం తగ్గటానికి కారణమని రైతులంటున్నారు. ఇప్పుడే ధర ఇలా ఉంటే పంట పండాక పరిస్థితి మరెలా ఉంటుందో అని రైతులు వాపోతున్నారు.
పూత, పిందె దశలో మిర్చి...
ప్రస్తుతం మిర్చి పూత, పిందె దశలో ఉంది. అక్కడక్కడా పిందె కాస్త కాయ అవుతోంది. ఈ దశలో అక్కడక్కడా ఎర్రనల్లి ఆశిస్తుండగా ఆకు రసాన్ని పీల్చేస్తుంది. తామరపురుగు, ఎండు తెగులు సోకి ఆకులు, కాయలను ఆశించి రసాన్ని పీలుస్తుండగా ఆపై ఉధృతి ఎలా ఉంటుందో అని రైతులు భయపడుతున్నారు. ఇప్పుడే తెగుళ్ల నివారణకు రైతులు మందు స్ప్రే చేయటానికి అధికంగా ఖర్చు పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment