గూగుల్‌ సెర్చ్‌.. ఆరోగ్యం తూచ్‌ | - | Sakshi
Sakshi News home page

గూగుల్‌ సెర్చ్‌.. ఆరోగ్యం తూచ్‌

Published Fri, Dec 27 2024 1:18 AM | Last Updated on Fri, Dec 27 2024 1:18 AM

గూగుల

గూగుల్‌ సెర్చ్‌.. ఆరోగ్యం తూచ్‌

అనారోగ్య సమస్యలపై ఇంటర్‌నెట్‌లో బాధితుల పరిశోధన

డాక్టర్‌ వద్దకు వెళ్లక ముందే

రోగంపై సొంతగా నిర్ధారణ

డాక్టర్‌ ప్రిస్కిప్షన్‌లోని ప్రతి

మందుపైనా గూగుల్‌లో వెతుకులాట

నెట్‌లో చెప్పే దుష్ఫలితాలకు

భయపడి మందులు వాడని వైనం

ఫలితంగా కొత్త సమస్యలు

కొనితెచ్చుకుంటున్న రోగులు

లబ్బీపేట(విజయవాడతూర్పు): ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తింది ఆలస్యం దాని గురించి గూగు ల్‌లో శోధిస్తున్న విద్యావంతులు ఎక్కువయ్యారు. వైద్యుడి వద్దకు వెళ్లక ముందే గూగుల్‌లో పరిశీలించి తమకు ఫలానా వ్యాధి సోకిందని సొంతగా నిర్ధారణకు వస్తున్నారు. డాక్టర్‌ వద్దకు వెళ్లాక తమకు ఏ వ్యాధి వచ్చిందో చెప్పే వారి సంఖ్య ఇటీవల కాలంలో పెరిగారని వైద్యులు పేర్కొంటున్నారు. అంతేకాదు డాక్టర్‌ మందులు రాసిన తర్వాత ఆ మందుల గురించి గూగుల్‌లో చూసి ఏవైనా దుష్ఫలితాలు వస్తాయని తెలిస్తే చాలు వాటిని పక్కన పడేస్తున్నారు. ఫలితంగా వారికి వచ్చిన జబ్బు ముదిరిపోతోందని వైద్యులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇడియట్‌ (ఇంటర్నెట్‌ డెరీవ్డ్‌ ఇన్ఫర్మేషన్‌ అబ్‌స్ట్రక్షన్‌ ట్రీట్‌మెంట్‌) సిండ్రోమ్‌తో బాధపడుతున్న వారు రోజు రోజుకూ పెరుగుతున్నారని, కోవిడ్‌ సమయంలో గూగుల్‌లో పరిశోధన ఎక్కువగా జరిగిందని వైద్యులు పేర్కొంటున్నారు. విజయవాడలోనూ ఇలాంటి వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోందని వివరిస్తున్నారు.

కొత్త సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు

ప్రతి విషయాన్ని గూగుల్‌లో సెర్చ్‌ చేయడం ద్వారా కొత్త సమస్యలను కొని తెచ్చుకుంటున్నారని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. మందులు, జబ్బు విషయంలో ఏదైనా సందేహం ఉంటే వైద్యు డిని అడిగి నివృత్తి చేసుకోవాలే కానీ, గూగుల్‌ను ఆశ్రయించడం సరికాదని సూచిస్తున్నారు. ఒక మందు వాడిన లక్ష మందిలో ఒకరికి దుష్ఫలితాలు వచ్చినా, గూగుల్‌లో పెడుతుంటారని, దానిని చూసి మందు వాడకుంటే, జబ్బు ముదిరి ప్రాణాల మీదకు వస్తుందని హెచ్చరిస్తున్నారు. కామన్‌ మందు క్రోసిన్‌కు కూడా దుష్ఫలితాలు ఉన్నట్లు గూగుల్‌లో ఉంటుందని పేర్కొంటున్నారు. అది మంచి పద్ధతి కాదని మానసిక వైద్యులు సూచిస్తున్నారు.

డాక్టర్‌ గూగుల్‌గా మారిన వైనం

కొంత మంది చదువుకున్న వారు ఏదైనా జబ్బు బారిన పడితే వెంటనే గూగుల్‌లో సెర్చ్‌ చేసి మందులు వాడేస్తున్నారు. ఆ మందులను కూడా ఆన్‌లైన్‌లోనే తీసుకుంటున్నారు. ఇది సరైన విధానం కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆ జబ్బుకు చికిత్స సరిగ్గా జరగక పోతే ప్రాణాల మీదకు వస్తుందంటున్నారు. గూగుల్‌ డాక్టర్‌గా మారిన వారు కూడా ఇడియట్‌ అనే సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్లు గుర్తించాల్సి ఉందన్నారు. జబ్బు చేసిన వ్యక్తి వ్యవహారశైలి, మానసిక పరిస్థితిని కుటుంబ సభ్యులు అంచనా వేయాల్సి ఉందని సూచిస్తున్నారు. కొన్ని రకాల మానసిక జబ్బులు, సెక్స్‌ సామర్థ్యం పెరిగేందుకు వాడే వయగ్రా వంటి వాటి గురించి కూడా ఎక్కువగా గూగుల్‌లో సెర్చ్‌ చేస్తున్నట్లు వైద్యులు వివరిస్తున్నారు.

అవసరం మేరకు టెక్నాలజీని వాడాలి

గూగుల్‌ వంటి ఇంటర్నెట్‌ టెక్నాలజీని అవసరం మేరకు మాత్రమే వాడుకోవాలి. జబ్బు చేసినప్పుడు వైద్యుడిని సంప్రదించకుండా గూగుల్‌లో చూసి జబ్బును నిర్ధారించడం, మందులు వాడటం సరైన పద్ధతి కాదు. కొంత మంది వైద్యుడు రాసిన మందులను సైతం గూగుల్‌లో సెర్చ్‌ చేసి, అక్కడ ఉన్న దుష్ఫలితాలను చూసి వాడటం మానేస్తున్నారు. దీంతో జబ్బు ముదిరి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కోవిడ్‌ సమయంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చూశాం. ఏదైనా సమస్య ఉంటే వైద్యుడిని సంప్రదించి పరిష్కరించుకోవాలి.

– డాక్టర్‌ గర్రే శంకరరావు, సైకాలజిస్ట్‌

సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు

ఏదైనా జబ్బు చేసి వైద్యుని వద్దకు వచ్చిన కొంత మంది రోగులు తమకు వచ్చిన వ్యాధి ఏమిటో చెప్పేస్తున్నారు. గూగుల్‌లో చూశామండీ, దానికి చికిత్స ఇవ్వండి అని అడుగుతున్నారు. అసలు లక్షణాలు చెప్పమంటే ఏదేదో చెబుతున్నారు. గూగుల్‌లో అంతా కచ్చితమైన సమాచారం ఉంటుందని చెప్పలేం. ఎవరి అనుభవాలనైనా దానిలో షేర్‌ చేసుకోవచ్చు. పారాసెట్మాల్‌ మందుకు కూడా గూగుల్‌లో సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉన్నట్లు చూపుతుంది. వైద్యులు పారాసెట్మాల్‌ను కామన్‌ మందుగా సిఫార్సు చేస్తారు. చాలా మంది గూగుల్‌తో కొత్త సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు.

– డాక్టర్‌ అశోక్‌బాబు, మానసిక వైద్య నిపుణుడు

No comments yet. Be the first to comment!
Add a comment
గూగుల్‌ సెర్చ్‌.. ఆరోగ్యం తూచ్‌ 1
1/2

గూగుల్‌ సెర్చ్‌.. ఆరోగ్యం తూచ్‌

గూగుల్‌ సెర్చ్‌.. ఆరోగ్యం తూచ్‌ 2
2/2

గూగుల్‌ సెర్చ్‌.. ఆరోగ్యం తూచ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement