కొనసాగిన భవానీల రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ మహోత్సవాలు ముగిసినప్పటికీ గురువారం భవానీలు, భక్తుల రద్దీ కొనసాగింది. బుధవారం రాత్రి నుంచి గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకున్న భవానీలు గురువారం తెల్లవారుజాముకు క్యూలైన్లలో చేరుకున్నారు. తెల్లవారుజామున అమ్మవారికి నిత్య పూజలు నిర్వహించిన అనంతరం భవానీలను దర్శనానికి అనుమతించారు. గురువారం ఉదయం కూడా గిరి ప్రదక్షిణ మార్గంలో భవానీల రద్దీ కనిపించింది. మధ్యాహ్నం అమ్మవారికి మహా నివేదన సమర్పించేందుకు అర్ధగంట పాటు అన్ని దర్శనాలను నిలిపివేయడంతో రద్దీ కొంత పెరిగింది. మహా నివేదన అనంతరం భక్తుల దర్శనాలు యథావిధిగా కొనసాగాయి. భవానీలు మహా మండపం దిగువన ఇరుముడులు, హోమగుండాల్లో నేతి కొబ్బరి కాయలను సమర్పించారు. మహా మండపం వద్ద దేవస్థానం ఏర్పాటు చేసిన అమ్మవారి అన్న ప్రసాదాలను స్వీకరించడంతో పాటు కనకదుర్గనగర్‌లో లడ్డూ ప్రసాదాలను కొనుగోలు చేశారు.
నేటి నుంచి యథాతథంగా ఆర్జిత సేవలు
ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో శుక్రవారం నుంచి అన్ని ఆర్జిత సేవలు యథాతథంగా కొనసాగుతాయి. తెల్లవారుజామున అమ్మవారి ప్రధాన ఆలయంలో మూలవిరాట్ వద్ద ఖడ్గమాలార్చన, ఆలయ ప్రాంగణంలో లక్ష కుంకుమార్చన, శ్రీచక్ర నవార్చన, శాంతి కల్యాణంతో పాటు చండీ హోమాలను నిర్వహించనున్నారు. సాయంత్రం అమ్మవారికి జరిగే పంచహారతుల సేవనూ భక్తులు తిలకించవచ్చు. ఆయా ఆర్జిత సేవల టికెట్లను ఆన్‌లైన్‌తో పాటు దేవస్థాన ఆర్జిత సేవా కౌంటర్లలో పొందవచ్చు. భవానీ దీక్ష విరమణ మహోత్సవాల్లో భక్తులు అమ్మవారికి సమర్పించిన కానుకలు, ముడుపులు, మొక్కుబడులను సోమ, మంగళవారాల్లో లెక్కించనున్నారు. మహా మండపం ఆరో అంతస్తులో కానుకల లెక్కింపు జరుగుతుందని ఆలయ అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment