కవిత్వం.. విశ్వభాష | - | Sakshi
Sakshi News home page

కవిత్వం.. విశ్వభాష

Published Sat, Jan 4 2025 7:57 AM | Last Updated on Sat, Jan 4 2025 7:57 AM

కవిత్

కవిత్వం.. విశ్వభాష

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): కవిత్వం ఒక విశ్వభాష అని పలువురు వక్తలు పేర్కొన్నారు. విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతున్న 35వ విజయవాడ పుస్తక మహోత్సవంలో భాగంగా కేంద్ర సాహిత్య అకాడమీ ఆధ్వర్యాన దక్షిణ–పశ్చిమ కవి సమ్మేళనాన్ని శుక్రవారం ప్రధాన వేదికపై నిర్వహించారు. ప్రముఖ కవి పాపినేని శివశంకర్‌ సభకు అధ్యక్షత వహించారు. చదువుతూ చదువుతూ ఒక్కసారి నేను ఉలిక్కిపడతాను.. అంటూ తన కవితను వినిపించారు. కవిత్వం ఒక మెరుపులా, పిడుగులా హృదయాలలోకి ప్రవేశించి మనల్ని మార్చివేస్తుందన్నారు. సామాజిక చైతన్యానికి కవిత్వం గొప్ప సాధనమన్నారు. దేశాల ఎల్లలకు అతీతంగా ప్రజలను ఏకం చేసే శక్తి కవిత్వానికి ఉందని చెప్పారు. అంతర్ముఖమవుతూనే బహిర్గతం కావడం, విశాల విశ్వ అవధులను మనసులో కనుగొనడం కేవలం కవిత్వంతో సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి, కవి ఆర్పీ సిసోడియా మాట్లాడుతూ కవిత్వం అనేది అద్భుతమైన భావవ్యక్తీకరణ విధానమన్నారు. కృత్రిమ మేధ అభివృద్ధి చెందినా నిజమైన కవిత్వాన్ని సృష్టించలేదన్నారు. సమాజంలో కవిత్వాన్ని ఆస్వాదించే అభిరుచి కనుమరుగు అవుతుండటం దురదృష్టకరమన్నారు. గుజరాతీ కవయిత్రి ఈషా దాదావాలా, మళయాళీ కవి, పీఎస్‌ గోపీకృష్ణన్‌, మరాఠీ కవయిత్రి స్వాతి షిండే పవార్‌, కన్నడ కవి సుమిత్‌ మైత్రి, కొంకణీ కవి ప్రకాష్‌ డి నాయక్‌, సింధీ కవి హరీష్‌ కరం చందానీ, తమిళ కవి షణ్ముగం విమల్‌కుమార్‌ తమ కవిత్వాలతో స్థానిక సమాజాల్లోని మధ్యతరగతి, దిగువ తరగతి వ్యక్తుల అంతరంగాలను ప్రతిబింబించే పలు కవితలను వినిపించి అలరించారు. పోరాడి తమ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. సాహిత్య అకాడమీ సభ్యులు ఎమెస్కో విజయ కుమార్‌ సభకు స్వాగతం పలుకుతూ, భాషలు ఏమైనా కవుల చేతుల్లో అవి మానవ హృదయాలను స్పందింపజేసి, సౌకుమార్యం చేయగలవన్నారు. పుస్తక మహోత్సవ సంఘం కార్యదర్శి మనోహర్‌ నాయుడు వందన సమర్పణ చేశారు.

దక్షిణ–పశ్చిమ కవి సమ్మేళనంలో కవులు

No comments yet. Be the first to comment!
Add a comment
కవిత్వం.. విశ్వభాష1
1/1

కవిత్వం.. విశ్వభాష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement