రచయితలు, జర్నలిస్టులపై దాడులు బాధాకరం
అభ్యుదయ రచయితల సంఘం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రచయితలు, మేధావులు, జర్నలిస్టులు, హేతువాదులు, ప్రశ్నించే శక్తులపై ఉన్మాదుల దాడులు, పాలకుల నిర్బంధాలు జరగడం బాధాకరం అని ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం (అరసం) జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ గాంధీనగర్‌లోని హనుమంతరాయ గ్రంథాలయంలో ఆదివారం అరసం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు రాచపాళెం చంద్రశేఖరరెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. అరసం మన్యం జిల్లా వెలువరించిన కవితా సంకలనం ‘శతర‘ పుస్తకాన్ని పెనుగొండ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్, సిరికి స్వామినాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. సమాజంలో యువతరం, ప్రజలు నమ్మకానికి వాస్తవానికి మధ్య కొట్టుమిట్టాడుతూ ఏది నిజమో, ఏది అబద్ధమో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. తిరుమల క్షేత్రంపై వెలువడిన పుస్తకాలను విక్రయిస్తున్న జర్నలిస్టు ఎన్.వేణుగోపాల్, మధ్యప్రదేశ్‌లో రచయిత మెర్సీ మార్గరెట్‌పై దాడులు చేయడం దుర్మార్గమన్నారు. యువతలో అభ్యుదయ సాహిత్యం, భావజాలాన్ని పెంపొందించడంలో అరసం 85 ఏళ్లుగా నిరంతరం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు బి.ఎన్.సాగర్, ఆనంద్, జ్యోతిశ్రీ, కలం ప్రహ్లాద, ఈశ్వరరెడ్డి, జి.ఎస్.చలం, అప్పల రాజు, పరుచూరి అజయ్ కుమార్, మోతుకూరి అరుణకుమార్, చంద్రా నాయక్, పెంచలయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment