అక్రమార్కుల్లో గుబులు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: పెనమలూరు మండలం తాడిగడప మునిసిపాలిటీ పరిధిలో అక్రమార్కులు బెంబేలెత్తుతున్నారు. అక్రమ లేఅవుట్లు, అక్రమ భవన నిర్మాణాలపై ‘అవినీతి మేడల గడప’ శీర్షికన ‘సాక్షి’లో సోమ వారం ప్రచురించిన కథనం సర్వత్రా చర్చనీయాంశమైంది. యనమలకుదురు, తాడిగడపకు చెందిన రియల్టర్లు, బిల్డర్లు సోమవారం ఉదయమే టీడీపీ పెనమలూరు నియోజకవర్గ ప్రజాప్రతినిధి వద్దకు పరుగు తీశారు. తాము ఇప్పటికే అడిగినంత ముడుపులు ఇచ్చామని, ‘సాక్షి’లో కథనం రావటంతో తమ పరి స్థితి ఏమిటని ఆ ప్రజాప్రతినిధి వద్ద వాపోయారు. అయితే ఆ ప్రజాప్రతినిధి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించి తాను ఉన్నానని, ఇబ్బంది లేకుండా చూస్తానని ఉత్తరకుమార ప్రగల్భాలతో అక్రమార్కులకు హామీ ఇచ్చినట్లు సమాచారం. అక్రమార్కులను మాత్రం భయాందోళనలు వెంటాడుతూనే ఉన్నాయి. టీడీపీ నియోజకవర్గ ప్రజాప్రతినిధి, టౌన్ ప్లానింగ్ అధికారి మాయమాటలు నమ్మి మోసపోయామని, డబ్బులు ముట్టజెప్పామని, అక్రమ కట్టడాలతో పాటు, అక్రమ లేఅవుట్లపైనా కొరడా ఝులిపిస్తే నిండా మునగడం ఖాయమని మథన పడుతున్నారు. అక్రమ లేఅవుట్లలో ప్లాట్లు కొన్నవారు, ప్లాన్ రాకపోతే తమ గతి ఏమిటని, లేఅవుట్లలో అభివృద్ధి ఉండదని, బ్యాంక్ రుణాలు రావని ఆందోళన చెందుతున్నారు.
వణికిపోతున్న కలెక్షన్ ఏజెంటు
ఇటీవల తాడిగడప మునిసిపాలిటీకి బదిలీపై వచ్చిన ఓ టౌన్ ప్లానింగ్ అధికారే కలెక్షన్ ఏజెంట్ అవతారం ఎత్తి మునిసిపల్ అధికారి, నియోజకవర్గ ప్రజాప్రతినిధికి ముడుపుల వసూలులో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ అధికారి సోమవారం ఉదయాన్నే ప్రజాప్రతినిధి ఇంటికి వెళ్లి శరణుకోరినట్లు సమాచారం. యన మలకుదురుతో పాటు పలు ప్రాంతాల్లో ఈ అధికారి వసూలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మునిసిపల్ అధికారి సైతం తాడిగడపలో భవన నిర్మాణాలకు సంబంధించిన పెత్తనం ఈ అఽధికారికే అప్పజెప్పారని సమాచారం. మునిసిపాలిటీలో ఇంకొక టౌన్ ప్లానింగ్ అధికారి ఉన్నా నామ మాత్రంగా ఏరియా కూడా కేటాయించలేదని, లాగిన్‌లు కూడా ఇవ్వకుండా కలెక్షన్ ఏజెంటు వద్దే ఉంచుకొన్నట్లు మునిసిపల్ వర్గాల్లోనే చర్చ సాగుతోంది.
అక్రమ వసూళ్లలో లుకలుకలు
అక్రమ లేఅవుట్‌కు ఎకరాకు రూ.10 లక్షల చొప్పున వసూలు చేయడంపై మునిసిపల్ అధికారి, నియోజకవర్గ ప్రజాప్రతినిధి మధ్య లుకలుకలు మొదలయ్యాయి. సదురు అధికారి అక్రమ లేఅవుట్ ఎకరాకు రూ.10 లక్షలు, సొంత భవనం నిర్మాణానికి ప్లాన్‌కు రూ.లక్ష, గ్రూప్ హౌస్‌కు రూ.3 లక్షల చొప్పున వసూలు చేయడంపై ఆ ప్రజాప్రతినిధి అక్కసు వెళ్లగక్కినట్లు తెలిసింది. తన జేబులోకి రావాల్సిన అక్రమ వసూళ్లపై టార్గెట్ చేయడాన్ని ఆయన జీర్ణించుకో లేక ఆ అధికారిపై మండిపడినట్లు మునిసిపాలిటీలో చర్చించుకుంటున్నారు. తాడిగడప మునిసిపాలిటీలో జరుగుతున్న అక్రమ వసూళ్ల దందా ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్లిందని టీడీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. ఈ వార్తపై ముఖ్యమంత్రి కార్యాలయం, ఏసీబీ, విజిలెన్స్ అధికారులు సైతం ఆరా తీసినట్లు చర్చ సాగుతోంది.
‘అవినీతి మేడల గడప’ కథనంపై సర్వత్రా చర్చ టీడీపీ ప్రజాప్రతినిధి వద్దకు అక్రమార్కుల పరుగు ఆందోళన చెందుతున్న రియల్టర్లు, బిల్డర్లు
Comments
Please login to add a commentAdd a comment