ఇంద్రకీలాద్రిపై భక్తజన సందడి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై ఆదివారం భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. భక్తులు, ఉభయదాతలతో పాటు హైందవ సభకు విచ్చేసిన యాత్రికులు సైతం ఇంద్రకీలాద్రికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజాము నాలుగు గంటల నుంచే భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. ఉదయం ఆరు గంటలకే ఆలయ ప్రాంగణంలోని క్యూ భక్తులతో కిటకిటలాడాయి. సర్వ దర్శనంతో పాటు రూ. 100, రూ. 300, రూ. 500 టికెట్ల క్యూలైన్లలో భక్తుల తాకిడి కనిపించడంతో ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు. భక్తులకు త్వరితగతిన అమ్మవారి దర్శనం కల్పించారు. మరో వైపున ఆది దంపతులకు నిర్వహించిన ఖడ్గమాలార్చన, శ్రీచక్రనవార్చన, లక్ష కుంకుమార్చన, చండీహోమం వంటి అర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. హైందవ సభకు విచ్చేసిన యాత్రికులు అమ్మవారి దర్శనానికి విచ్చేయడంతో వారి కోసం దేవస్థానం బస్టాండ్, రైల్వేస్టేషన్ నుంచి బస్సులను ఏర్పాటు చేసింది. మరో వైపు భవానీఘాట్, పున్నమి ఘాట్ పార్కింగ్ ప్రదేశం నుంచి కూడా దేవస్థాన బస్సులను అందుబాటులో ఉంచింది. మధ్యాహ్నం అమ్మవారికి మహా నివేదన నిమిత్తం అరగంటపాటు అన్ని దర్శనాలు నిలిపివేశారు. దీంతో రద్దీ మరింత పెరిగింది. మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు రద్దీ కొనసాగగా, సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవలో ఉభయదాతలు, భక్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment