కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే విద్యుత్ బస్సులు
కృష్ణలంక(విజయవాడతూర్పు): కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యుత్ బస్సులను ప్రవేశ పెడుతుందని ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ ప్రధాన కార్యదర్శి ఆర్.లక్ష్మయ్య అన్నారు. గవర్నర్‌పేట, రాఘవయ్య పార్కు సమీపంలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో ఏపీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు జిలానీ బాషా అధ్యక్షతన ’విద్యుత్ బస్సుల నిర్వహణ నేరుగా ఆర్టీసీకే కల్పించాలి’ అనే అంశంపై రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మయ్య మాట్లాడుతూ.. విద్యుత్ బస్సులను ఆర్టీసీ పరిధిలో కాకుండా ప్రైవేట్ రంగంలో తీసుకొస్తుండటంతో భవిష్యత్తులో ఉద్యోగులు, కార్మికుల ఉద్యోగ భద్రత కూడా ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. విద్యుత్ బస్సుల వచ్చాక వాటి నిర్వహణ వ్యయం కూడా ఎక్కువేనని, వాటితో ప్రజలపై చార్జీల భారం మోపుతారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఇక సమరం చేయాల్సిందేనని సూచించారు. విద్యుత్ బస్సుల వెనుక ఉన్న కుట్రలను ప్రజలకు వివరించి చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. మొత్తం వాహనాల్లో 0.69 లోపు మాత్రమే ఆర్టీసీ బస్సులున్నాయని, ప్రభుత్వాలు కాలుష్యానికి ఆర్టీసీ బస్సులే ఎక్కువ కారణమన్నట్టు చిత్రీకరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉద్యోగ సంఘాలతో చర్చించాలి..
సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.నర్సింగరావు మాట్లాడుతూ కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ బస్సుల పథకం ఆమోదిస్తే ఆర్టీసీ పూర్తిగా కనుమరుగవుతుందన్నారు. ఉద్యోగులు ఉపాధి కోల్పోతారని, ప్రజలపై మరింత భారాలు పెరుగుతాయని చెప్పారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరించకుండా ఉద్యోగ సంఘాలతో చర్చించి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సదస్సులో ఏపీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అయ్యప్పరెడ్డి ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు రామయ్య, రాజశేఖర్, శివకుమార్, రాములు, ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు అహ్మద్, శివాజీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment