పాలిటెక్నిక్ విద్యార్థుల్లో అద్భుతమైన ప్రతిభ
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థుల్లో అద్భుతమైన ప్రతిభ ఉందని, విద్యార్థుల ఆలోచనలకు వాస్తవ రూపమిచ్చే ఫ్యాకల్టీ ఉందనే విషయం పాలిటెక్ ఫెస్ట్‌తో రుజువైందని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. నగరంలోని ఎస్‌ఎస్ కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతున్న పాలిటెక్ ఫెస్ట్ 2024–25లో రెండో రోజు మంగళవారం లోకేష్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన టెక్ ప్రాజెక్టులను పరిశీలించారు. ప్రతి ప్రాజెక్టును సందర్శించి విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఫెస్ట్ ఈవెంట్ కాదు.. మూవ్‌మెంట్
మంత్రి లోకేష్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అటానమస్ ఫెయిర్ డిటెక్షన్ అండ్ ఎక్స్‌ట్వింగిషర్ సిస్టమ్‌ను రూపొందించిన ఈశ్వర్, లక్ష్మీశరణ్యల పట్టుదల మిగిలిన విద్యార్థులకు ప్రేరణ అని పేర్కొన్నారు. ఐటీఐలు, పాలిటెక్నిక్స్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా తయారు కావాలని చెప్పారు. ఈ పాలిటెక్ ఫెస్ట్ అనేది ఒక ఈవెంట్ కాదని, మూవ్‌మెంట్ అన్నారు. రాజధాని ఒకే దగ్గర ఉండాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, ఒక ఎకో సిస్టమ్ ఏర్పడాలనేది ప్రభుత్వ విధానమని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక్కో ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ పి.అశోక్‌బాబు, స్కూల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ, సాంకేతిక విద్య సంచాలకులు జి.గణేష్‌కుమార్, అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్
Comments
Please login to add a commentAdd a comment