రాజ్యాంగం పెను ప్రమాదంలో ఉంది
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): భారత రాజ్యాంగం దేశంలోని కొన్ని శక్తుల కారణంగా పెను ప్రమాదాన్ని ఎదుర్కొంటోందని కేరళ విద్యాశాఖ మాజీ మంత్రి ఎంఏ బేబి అన్నారు. విజయవాడ పుస్తక మహోత్సవంలో భాగంగా ప్రజాశక్తి ప్రచురించిన జస్టిస్ హెచ్‌ఎన్ నాగమోహనదాస్ రచించిన ‘రాజ్యాంగం మనకేమిచ్చింది’ పుస్తకావిష్కరణ కార్యక్రమం మంగళవారం సాయంత్రం ప్రధాన వేదికపై జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంఏ బేబి పుస్తకావిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అనేక మంది మేధావులు ఎన్నో చర్చలు, సమావేశాల అనంతరం ఆమోదించిన రాజ్యాంగాన్ని మనుస్మృతి కోణంలో నేడు ప్రశ్నించడం దారుణమన్నారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత సుప్రీంకోర్టుపై ఉందన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పని చేసిన చంద్రచూడ్ వంటివారు ఇచ్చిన కొన్ని తీర్పులు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని చెప్పారు.
దురదృష్టవశాత్తు ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ వంటి శక్తులు దేశంలోని అన్ని వ్యవస్థలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని తద్వారా దేశంలోని కొన్ని వర్గాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. నాగమోహనదాస్ తన రచనలో రాజ్యాంగంలో నేటి పరిస్థితుల్లో ఎదురవుతున్న సవాళ్లను నేర్పుగా వర్ణించారన్నారు. సభకు అధ్యక్షత వహించిన బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు సంపర దుర్గా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎంతో పటిష్టంగా నిర్మించిన మన రాజ్యాంగం మౌలిక స్వభావాన్నీ, దానికి ఎదురవుతున్న సవాళ్లనూ తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాలన్నారు. కార్యక్రమంలో ప్రజాశక్తి బుక్ హౌస్ మేనేజర్ కె.లక్ష్మయ్య, బుక్ ఫెస్టివల్ సొసైటీ కార్యదర్శి టి.మనోహర్‌నాయుడు, సాహితీవేత్తలు అచ్యుతరావు, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
హక్కుల కోసం ఉద్యమించిన యోధుడు సాయిబాబా
హక్కుల కోసం పోరాడిన ఉద్యమకారుడిగా సాయిబాబా ప్రజాస్వామ్య విలువలను నమ్మే వారందరికీ ఆదర్శప్రాయుడని ఆయన సహచరి ఏఎఎస్ వసంతకుమారి అన్నారు. సాహిత్య వేదిక మీద విప్లవ రచయితల సంఘం ప్రచురించిన అరుణతార ప్రత్యేక సంచిక ‘ప్రపంచ విప్లవ మానవుడు కామ్రేడ్ సాయిబాబా’ను సాయి బాల మిత్రుడు కేఎంఎంఆర్ ప్రసాద్ ఆవిష్కరించారు. అదే వేదికపై సాయిబాబా స్ఫూర్తి కవిత్వం నిండిన ‘నువ్వెళ్లిన దారిలో’ సాయి సహచరి వసంతకుమారి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సామ్రాజ్యవాదానికీ, ప్రపంచీకరణకూ వ్యతిరేకంగా అనేక రచనలు చేశాడని చెప్పారు. సాయిబాబా ఆలోచనలనూ, ఆయన కలలనూ సాకారం చేసేందుకు మిత్రుల సహాయంతో ప్రయత్నిస్తామన్నారు. కేఎంఎంఆర్ ప్రసాద్ మాట్లాడుతూ పోలియోతో రెండు కాళ్లూ పోగొట్టుకున్నా ప్రకృతిని ప్రేమించాడన్నారు. జైలులో ఉండి కూడా, తనతో పాటు విచారణ ఖైదీలుగా ఉన్న ఆదివాసుల హక్కుల కోసం పోరాడిన మానవతావాది అని వివరించారు. కవితా సంచిక సంపాదకురాలు వైష్ణవి శ్రీ, శ్రీరామ్ తదితరులు సభలో పాల్గొన్నారు.
కేరళ మాజీ మంత్రి ఎంఏ బేబి
Comments
Please login to add a commentAdd a comment