అందినకాడికి దోచేయటమే !
కంకిపాడు: ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీకి అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఒకేసారి అన్ని తరగతుల ఫీజులను పెంచేసి తల్లిదండ్రుల ముక్కు పిండి వసూళ్లు చేసుకున్నాయి. ప్రస్తుతం పదో తరగతి పరీక్ష ఫీజులను సైతం వదలకుండా దోపిడీ దందా సాగిస్తూ ‘మమ్మల్నెవడ్రా ఆపేది’ అన్న చందంగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఫీజు పేరుతో సాగుతున్న దోపిడీపై విద్యాశాఖ కనీస పర్యవేక్షణ చేయకపోవటంతో విద్యాసంస్థల గల్లాలు నోట్ల కట్టలతో నిండిపోతున్నాయి.
ఫీజు పేరుతో దోపిడీ..
ఎన్టీఆర్ జిల్లాలోని 339 ప్రైవేటు విద్యాసంస్థల్లో 15,956 మంది, కృష్ణా జిల్లాలోని 180 ప్రైవేట్ విద్యాసంస్థల్లో 9954 మంది పదో తరగతి విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. మార్చిలో నిర్వహించనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు విద్యాశాఖ పరీక్ష ఫీజుగా ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రూ.125 నిర్ణయించింది. అపరాధ రుసుం మరో రూ.వెయ్యి అధికారికంగానే వసూలు చేయాలని ప్రకటించింది. అయితే ప్రైవేటు విద్యాసంస్థలు మాత్రం పరీక్ష ఫీజును తమ ఆదాయ మార్గంగా ఎంచుకున్నాయి. గతేడాది నవంబర్, డిసెంబర్ మొదటి వారాల్లోనే విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేశాయి. అయితే పలు విద్యాసంస్థలు విద్యార్థి నుంచి రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు వసూలు చేశాయి. దీనికి కనీసం ఎలాంటి రశీదులు కూడా ఇవ్వలేదు. ఈ మొత్తం ఫీజుతో పాటుగా పరీక్ష జరిగిన రోజు పరీక్ష కేంద్రానికి విద్యార్థిని తీసుకెళ్లి, తీసుకు వచ్చేందుకు అని చెబుతున్నాయి. పిల్లల బాధ్యత తాము తీసుకుంటామని తల్లిదండ్రులు చెప్పినా ససేమిరా అంటూ అదనపు సొమ్ము రాబట్టుకున్నాయి. విద్యాశాఖ వెబ్‌సైట్‌లో మాత్రం ఫీజు రూ.125 నమోదు చేస్తుండటం గమనార్హం.
ప్రైవేట్ విద్యాసంస్థలకు రెక్కలు..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో ప్రైవేటు విద్యాసంస్థలకు రెక్కలు వచ్చాయి. తామే గెలిపించుకున్నామని, తామే అధికారంలోకి వచ్చామని భావిస్తున్నాయి. ఈ విద్యాసంవత్సరం గతంతో పోలిస్తే ఫీజులు భారీగా పెంచాయి. ఐదో తరగతిలోపు విద్యార్థులకు రూ.5 వేల లోపు, ఆరు నుంచి పది తరగతిలోపు విద్యార్థులకు రూ.7 వేల నుంచి రూ.14 వేల వరకూ పెంచాయి. ప్రధాన పట్టణాల్లో అయితే రూ.20 వేలు కూడా అదనంగా పెంచిన పరిస్థితి.
విద్యాశాఖ పర్యవేక్షణేదీ?
ప్రైవేటు విద్యాసంస్థలపై విద్యాశాఖ పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. అడ్డగోలుగా ఫీజులు నిర్ణయించి తల్లిదండ్రులను పీల్చిపిప్పి చేస్తున్నా పట్టించుకోవటం లేదు. కనీసం ఏ విద్యాసంస్థ దగ్గరా కూడా అందరికీ కనిపించేలా ఫీజులు వివరాలు లేని పరిస్థితి. ఆఖరికి పదో తరగతి ఫీజుల్లోనూ తమ దందా సాగిస్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తనిఖీలు, పర్యవేక్షణ లేకపోవటమే ఇందుకు కారణంగా చెబుతున్నారు.
ప్రైవేటు విద్యాసంస్థల ఫీజు దోపిడీ పది పరీక్ష ఫీజునూ వదలని విద్యాసంస్థలు అడ్డగోలుగా సొమ్ము వసూళ్లు రశీదులు ఉండవంటూ కల్లబొల్లి కబుర్లు పర్యవేక్షించని విద్యాశాఖ
ఫిర్యాదు చేస్తే చర్యలు..
విద్యాశాఖ నిర్ణయించిన మేరకే ఫీజుల వసూళ్లు ఉండాలి. ఫీజు రూ 125, అపరాధ రుసుము రూ వెయ్యి. అంతకు మించి వసూళ్లు చేస్తున్నారని ఎవరైనా ఫిర్యాదు చేస్తే సంబంధిత విద్యాసంస్థలపై క్షేత్రస్థాయి విచారణ సాగిస్తాం. అవసరమైన చర్యలు కఠినంగా తీసుకుంటాం. మాకు ఇప్పటి వరకూ అదనపు వసూళ్లకు సంబంధించి ఫిర్యాదులు అందలేదు.
– పీవీజే రామారావు,
కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి
Comments
Please login to add a commentAdd a comment