ఎన్టీఆర్ జిల్లా సీపీఎం కార్యదర్శిగా కృష్ణ ఎన్నిక
తిరువూరు: ఎన్టీఆర్ జిలా సీపీఎం కార్యదర్శిగా డీవీ కృష్ణ తిరిగి ఎన్నికయ్యారు. సీపీఎం ఎన్టీఆర్ జిల్లా మహాసభలు తిరువూరు సుగాలి కాలనీలోని సంకా నరసింహారావు ఫంక్షన్ హాలులో శనివారం, ఆదివారం జరిగాయి. కార్య వర్గ సభ్యులుగా కాశీనాథ్, శ్రీనివాస్, నాగేంద్రప్రసాద్, వీరాంజనేయులు, కె.శ్రీదేవి, కోట కల్యాణ్, బి.సత్యబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
బైకులు తగలబెట్టిన ఘటనలో నిందితుడు బాలుడు
మతిస్థిమితం లేని మైనర్ చేసినట్లు
పోలీసుల నిర్ధారణ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విద్యాధరపురం కొట్టేటి కోటయ్య వీధిలో గురువారం అర్ధరాత్రి బైక్‌లు తగలబెట్టిన కేసులో నిందితుడుని భవానీపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొట్టేటి కోటయ్య వీధిలో ఇంటి ఎదుట పార్కింగ్ చేసిన 5 బైక్‌లను తగలబెట్టిన ఘటనపై ఈనెల 3వ తేదీన పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్, ఇతర సాంకేతిక ఆధారాలతో నిందితుడుని గుర్తించారు. నిందితుడు బాలుడిగా పోలీసులు నిర్ధారించారు. కబేళాకు చెందిన మైనర్ బాలుడు ఇంటర్ మొదటి ఏడాది చదువుతున్నాడు. కొంతకాలంగా అతనికి మతిస్థిమితం సరిగా లేదు. ఈ నేపథ్యంలో కొట్టేటి కోటయ్య వీధిలో బైక్‌లకు నిప్పంటించి తగలబెట్టినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితుడిపై బీఎన్‌ఎస్ 326(ఎ) కింద కేసు నమోదు చేశారు.
బుడమేరులో కారు పల్టీ
మధురానగర్(విజయవాడసెంట్రల్): విజయవాడ 30వ డివిజన్‌లోని దావు బుచ్చయ్యకాలనీ శ్రీ శ్యామలాంబదేవి దేవాలయం సమీపంలో ఆదివారం ప్రమాదవశావత్తూ కారు బుడమేరులోకి పల్టీకొట్టింది. వివరాల్లోకి వెళితే.. బుడమేరు మధ్యకట్టకు చెందిన సాయి ఆదివారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో దావు బుచ్చయ్యకాలనీ శ్రీశ్యామలాంబదేవి దేవాలయం సమీపంలో కారు రివర్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో రోడ్డుపై ద్విచక్రవాహనం అడ్డుగా ఉండటంతో డ్రైవింగ్ చేస్తున్న సాయి బ్రేక్ నొక్కబోయి యాక్సిలేటర్ తొక్కారు. దీంతో కారు వేగంగా బుడమేరులోకి పల్టీలు కొడుతూ దూసుకెళ్లింది. ఈ క్రమంలో ద్విచక్రవాహనంపై ఉన్న న్యూ రాజరాజేశ్వరిపేటకు చెందిన మోహనరావును కారు ఢీ కొట్టింది. స్థానికులు తక్షణమే స్పందించి బుడమేరులోకి వెళ్లిన కారులోని సాయిని, మరో వ్యక్తిని క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. గాయపడిన మోహనరావును 108లో ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. బుడమేరులోకి చొచ్చుకుపోయిన కారును జేసీబీ సాయంతో బయటకి తీశారు. నిత్యం రద్దీగా విశాలంగా ఉండే ఈ దారిలో బుడమేరు పక్కన రక్షణ గోడ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. రక్షణ గోడ ఉండి ఉంటే కారు బుడమేరులోకి వెళ్లిపోయే పరిస్ధితి ఉండేది కాదంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment