నీరసించి.. ఓపీక నశించి..
● ఓపీ చీటీ రావాలంటే గంట క్యూలో ఉండాల్సిందే ● ఓపీ పరీక్షల వద్ద అదే పరిస్థితి ● సరైన పర్యవేక్షణ లేక రోగుల అవస్థలు ● ఏసీ గదులకే పరిమితమైన ఆర్‌ఎంఓలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): జబ్బు చేసి చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రికి వచ్చిన రోగులకు అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. ఓపీ చీటీ తీసుకునే వద్ద నుంచి, ఓపీ పరీక్షలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు.. ఇలా ప్రతి చోటా గంటల కొద్దీ క్యూలో నిల్చొని రోగులు నీరశించి పోతున్నారు. రోగులకు సత్వరమే సేవలు అందేలా చూడాల్సిన రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్స్(ఆర్‌ఎంఓలు) ఏసీ గదులకే పరిమితమవుతున్నారు. దీంతో ఇక్కడ నాణ్యమైన వైద్యం అందుతుందనే ఆశతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు ఇదేమి దయనీయ స్థితి అంటూ తమ పేదరికాన్ని నిందించుకుంటున్నారు. రోగుల పట్ల ఏ మాత్రం కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారంటూ ఆవేదన వెలిబుచ్చుతున్నారు.
ఓపీ చీటీకే కుస్తీ..
విజయవాడ కొత్త ప్రభుత్వాస్పత్రిలో ఓపీ చీటీ తీసుకోవాలంటేనే కుస్తీ పట్టాల్సిన పరిస్థితి నెలకొంది. గంటల కొద్దీ క్యూలో నిల్చోవడం, కౌంటర్ వద్ద తోపులాటలు ఇలా ఓపీ చీటీ చేతికందాలంటే కుస్తీ పట్టాల్సిందే. ప్రతిరోజూ కొత్తాస్పత్రికి 1500 నుంచి 1800 వరకూ అవుట్ పేషెంట్స్ వస్తుంటారు. వారికి చీటీలు ఇచ్చేందుకు గతంలో 8 కౌంటర్లు ఉండేవి. ప్రస్తుతం కంప్యూటర్లు రిపేర్లు కావడంతో మూడు కౌంటర్ల వద్దనే చీటీలు ఇస్తున్నారు. అంతేకాక మధ్యలో ప్రింటర్లు కూడా మొరాయిస్తున్నాయి. దీంతో రోగులు బారులు తీరుతున్నారు. ఓపీ చీటీ చేతికి వచ్చే సరికి 45 నిముషాల నుంచి గంటసేపు క్యూలో ఉండాల్సిన పరిస్థితి నెలకొంటుంది. దీంతో కొందరు నీరశించి కుప్పకూలిన ఘటనలు కూడా ఉన్నాయి. అంతేకాక రక్త పరీక్షలు చేయించుకునేందుకు నంబరు వేయాలన్నా, రిపోర్టులు తీసుకోవాలన్నా క్యూలో నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంటోంది.
ఓపీ వద్ద అంతే..
ఓపీ చీటీ తీసుకుని వారు పరీక్షలు చేయించుకునే ఓపీ వద్దకు వెళ్తే అక్కడ కూడా చాంతాడంత క్యూ ఉంటోంది. అక్కడ విధులు నిర్వర్తించే స్టాఫ్ ఓపీ చీటీలు తీసుకుని, వరుస క్రమంలో పిలిస్తే ఇబ్బంది ఉండదు. కానీ కొన్ని విభాగాల్లో పట్టించుకోకపోవడంతో గంటల పాటు క్యూలో నిల్చోవాల్సిన పరిస్థితి నెలకొంటోంది. ముఖ్యంగా సూపర్‌స్పెషాలిటీ విభాగాలైన కార్డియాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఓపీల వద్ద ఈ పరిస్థితి కనిపిస్తోంది. అధికారులు సైతం వారిని చూస్తూ వెళ్లిపోతారే కానీ, సరిచేసే ఆలోచన మాత్రం చేయడం లేదు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
విజయవాడ జీజీహెచ్‌లో ఓపీ కౌంటర్ల వద్ద బారులు తీరిన రోగులు
రోగులకు సౌకర్యాలు కల్పించాలి..
ప్రభుత్వాస్పత్రిలో రోగులు గంటల కొద్దీ క్యూలో నిల్చోవడం అత్యంత దయనీయం. అధికారులు పర్యవేక్షణ సరిగా లేక పోవడం దురదుష్టకరం. ఇప్పటికై నా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి. రోగులకు సత్వరమే వైద్యం అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.
– మునీర్ అహ్మద్ షేక్, ముస్లిం జేఏసీ రాష్ట్ర కన్వీనర్
అధికారులు ఉన్నది సంతకాలకేనా?
రోగులకు వైద్యం అందించడంలో ఎక్కడైనా ఇబ్బంది ఎదురవుతుందా, వైద్యులు ఓపీల్లో ఉన్నారా వంటి విషయాలను పర్యవేక్షించేందుకు కొత్తాస్పత్రిలో ఒక సివిల్‌సర్జన్ ఆర్‌ఎంఓ, ఒక డెప్యూటీ సివిల్‌సర్జన్ ఆర్‌ఎంఓ విధులు నిర్వర్తిస్తున్నారు. వారికి సహాయకారిగా సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఏఆర్‌ఎంఓగా ఉంటున్నారు. వీరంతా ఏసీ గదులకే పరిమితం అవడం, ఇండెంట్‌లపై సంతకాలు చేయడం మినహా రోగులు పడుతున్న ఇబ్బందులు వీరికి పట్టడం లేదు. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తిని ఆటోలో తీసుకు వస్తే, లోపలికి తీసుకు వచ్చేందుకు ఎవరూ సహయం చేయడం లేదంటూ ఆటో డ్రైవర్ ఆర్‌ఎంఓ వద్దకు వచ్చి తనగోడు వెళ్లబోసుకున్నాడు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. కానీ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తూనే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment