కుష్ఠు వ్యాధిని సమూలంగా నిర్మూలిద్దాం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కుష్ఠు వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో ప్రజలు భాగస్వాములు కావాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పిలుపునిచ్చారు. కుష్ఠు వ్యాధి నిర్మూలనలో భాగంగా సోమవారం నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు జిల్లాలో కుష్ఠు వ్యాధి పరీక్షలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సోమ వారం కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కుష్ఠు నివారణ అధికారి ఆధ్వర్యంలో నిర్వహించే కుష్ఠు వ్యాధి పరీక్షలకు సంబంధించిన పోస్టర్లను, కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు సోమవారం నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు మెడికల్ క్యాంపులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చర్మంపై స్పర్శ లేని మచ్చలు, చెవులు, వీపు, ఎదపై నొప్పి లేని బొడిపెలు, కనుబొమ్మలు రెప్పల వెంట్రుకలు రాలిపోవడం, కనురెప్పలు మూతపడకపోవడం, ముక్కుది బ్బడ, ముక్కు నుంచి రక్తం కారడం, కాళ్లు, చేతులు తిమ్మిర్లు, అరికాళ్లు, అరిచేతులలో స్పర్శ కోల్పోవడం, చల్లని లేదా వేడి వస్తువులను గుర్తించలేకపోవడం, చేతుల నుంచి వస్తువులు జారిపోవడం, చేతివేళ్లు, కాళ్ల వేళ్లు వంకర్లు తిరగడం వంటి లక్షణాలు కలిగిన వారిని గుర్తించి వారికి సమీపంలోని వైద్య ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు నిర్వహించి నిర్ధారణ చేస్తారన్నారు.
ఉచితంగా మందులు..
జిల్లా కుష్ఠు నివారణ అధికారి ఉషారాణి మాట్లాడుతూ వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నామన్నారు. సిబ్బంది ఇంటింటిని సందర్శించి వ్యాధి లక్షణాలు ఉన్న వారి డేటాను ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తారన్నారు. వ్యాధి నిర్ధారణ అయితే తీవ్రతను బట్టి 6 నెలల నుంచి 12 నెలల వరకు ఉచితంగా మందులు అందజేస్తారన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 54 లెప్రసీ కేసులను గుర్తించామన్నారు.ఈ కార్యక్రమంలో డీఆర్వో లక్ష్మి నరసింహం డీఎంఅండ్‌హెచ్‌వో ఎం. సుహాసిని, డీఆర్‌డీఏ పీడీ కె. శ్రీనివాసరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
Comments
Please login to add a commentAdd a comment