విధిగా హెల్మెట్ ధరించాలి
విజయవాడస్పోర్ట్స్: ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎన్టీఆర్ జిల్లా డెప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్(డీటీసీ) ఎ.మోహన్ సూచించారు. 36వ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా నగరంలోని ఎంజీ రోడ్డులో సోమవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని డీటీసీ మోహన్ ప్రారంభించి మాట్లాడారు. ఊహించని రీతిలో జరిగే రోడ్డు ప్రమాదాల నుంచి ప్రాణాలను హెల్మెట్ రక్షిస్తుందన్నారు. స్కూల్ పిల్లలను తీసుకెళ్లే ఆటో డ్రైవర్‌లు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రవాణా, పోలీస్ శాఖలు సమన్వయంతో పని చేస్తున్నామని, సీట్ బెల్ట్, త్రిబుల్ డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్‌పై చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆర్టీఓ కె.వెంకటేశ్వరరావు, ఎంవీఐలు కె.శివరామ్‌గౌడ్, ఉదయ్‌శివప్రసాద్, రవాణా శాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు ఎం.రాజుబాబు పాల్గొన్నారు.
మధ్యాహ్న భోజనాన్ని
పరిశీలించిన కృష్ణా కలెక్టర్
మొవ్వ: స్థానిక శ్రీ మండవ కనకయ్య జెడ్పీ ఉన్నత పాఠశాలను కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజాతో కలిసి సోమవారం మధ్యాహ్నం సందర్శించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. తమ వేతనాలు పెంచాలని మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు కోరగా, ఎమ్మెల్యే, కలెక్టర్ స్పందించి, వారి వినతిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. పాఠశాల విద్యార్థుల సంఖ్య, సంక్రాంతి సెలవుల అనంతరం వచ్చిన విద్యార్థుల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. భోజనం మెనూను పరిశీలించి, విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాల గణిత ల్యాబ్, కంప్యూటర్ (ఏటీఎల్) ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్‌ను పరిశీలించారు. పాఠశాల హెచ్‌ఎం సూర్యదేవర శ్రీదేవి, ఉపాధ్యాయులు పసుపులేటి శివ కోటేశ్వరరావు, మేకా రాణి, జాకీర్ అహ్మద్‌తో సంబంధిత అంశాలపై చర్చించారు.
శాప్ ఏఓగా
వెంకటరమణనాయక్
విజయవాడస్పోర్ట్స్: ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) పరిపాలన అధికారి(ఏఓ)గా ఆర్.వెంకటరమణనాయక్ సోమవారం ఉద్యోగ బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం శాప్ ఎండీ పి.ఎస్.గిరీషా, చైర్మన్ అనిమిని రవినాయుడును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఏఓ వెంకటరమణనాయక్‌కు కార్యాలయంలోని స్పోర్ట్స్ ఆఫీసర్‌లు, కోచ్‌లు, ఉద్యోగులు స్వాగతం పలికారు.
యువతరం చేతుల్లోనే దేశ భవిష్యత్
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఉంగుటూరు: భారత దేశ భవిష్యత్ యువతరం చేతుల్లోనే ఉందని తాను విశ్వసిస్తానని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్ట్‌లో శిక్షణ పొందుతున్న యువతతో సోమవారం ముఖాముఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలు, భాష, కుటుంబ విలువలను కాపాడుకొని ముందు తరాలకు అందజేయాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ కుటుంబ విలువలను కాపాడుకుని ఆదర్శనీయమైన యువతరంగా ఎదగాలని కోరారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుతో కలసి ట్రస్ట్ ఆవరణలో శిక్షణ కేంద్రాలను సందర్శించి, యువతతో కొద్ది సేపు ముచ్చటించారు. డైరెక్టర్ పరదేశి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment