గన్నవరం: స్థానిక సినిమా హాల్ సెంటర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు దుర్మరణం చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం.. మండలంలోని బుద్దవరం గ్రామ శివారు రాజీవ్‌నగర్ కాలనీకి చెందిన గుర్రం శేషు(65) ఇళ్ల వెంట తిరుగుతూ అప్పడాలు, జంతికలు విక్రయిస్తుంటాడు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం సినిమా హాల్ సెంటర్ వద్ద జాతీయ రహదారి దాటుతున్న అతడిని విజయవాడ నుంచి ఏలూరు వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శేషు చాతి భాగంపై లారీ ముందు టైర్లు ఎక్కడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment