![పరాకా](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/09trv53-310124_mr-1739217144-0.jpg.webp?itok=123v-Sba)
పరాకాష్టకు వేధింపులు
● ఆగని ఎమ్మెల్యే కొలికపూడి దాష్టీకాలు ● తాళలేక బాధితుల ఆత్మహత్యాయత్నాలు ● తిరువూరులో వరుస ఘటనలు ● పట్టించుకోని టీడీపీ హైకమాండ్ ● కేసులు నమోదు చేయని పోలీసులు
సాక్షి టాస్క్ ఫోర్స్: తిరువూరు టీడీపీ నియోజకవర్గ ప్రజాప్రతినిధి వరుస వివాదాలతో వార్తల్లోకి ఎక్కుతూనే ఉన్నారు. ఆయన వేధింపులు తాళలేక పలువురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నారు. ఇందులో సింహభాగం టీడీపీ పార్టీ కార్యకర్తలే ఉంటుండటం గమనార్హం. ఆయనపై టీడీపీ అధిష్టానానికి నియోజకవర్గ నాయకులు పలు మార్లు ఫిర్యాదు చేసినా ఫలితం మాత్రం శూన్యమే. ఇటీవల పార్టీ క్రమశిక్షణ కమిటీ పిలిపించినప్పటికీ ఎమ్మెల్యే తీరులో మాత్రం మార్పు లేదు. ఎన్నికల ప్రచారం సమయంలో ప్రారంభమైన ఆయన వివాదాల పరంపర.. ఎమ్మెల్యేగా గెలిచినా కొనసాగుతూనే ఉంది. అధికారులపై నోరు పారేసుకోవడం, ధర్నాలు చేయడం, ఏకంగా మద్యం షాపులకు తాళాలు వేయడం ఇలా డైరెక్ట్‌గా ఆయనే నేరుగా రంగంలోకి దిగుతున్నారు. మట్టి, పేకాట వంటి అక్రమ కార్యకలాపాల్లో ఆయన అవినీతి మరకలు అంటించుకున్నారు. మహిళలను వేధించడం, వారిపై దాడికి పాల్పడుతున్నారు. తాజాగా పల్లికంటే డేవిడ్ అనే టీడీపీ కార్యకర్త తనపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపిస్తూ పురుగుల మందు తాగాడు. ప్రస్తుతం విజయవాడలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయినప్పటికీ పోలీసులు కేసులు నమోదు చేయడం లేదు.
ఆది నుంచి వివాదాలే..
● ఎన్నికల ప్రచార సమయంలో తిరువూరు రాజుపేటలో పర్యటిస్తూ స్థానికులు డ్రెయినేజీ సమస్య గురించి అడిగినప్పుడు నగర పంచాయతీ కమిషనర్‌ను పిలిచి ‘నీకు కప్పల కూర తినిపిస్తా’ అంటూ అభ్యంతరకర రీతిలో పరుషంగా మాట్లాడారు.
● తిరువూరు నియోజకవర్గంలో ఇసుక, మట్టి తోలకాల వ్యవహారంలో, జూదాల నిర్వహణలో నాయకులకు, టీడీపీ నియోజకవర్గ ప్రజాప్రతినిధితో ఏర్పడిన వివాదాల నేపథ్యంలో తిరువూరు మండలం చిట్టేల గ్రామ సర్పంచి తుమ్మలపల్లి శ్రీనివాసరావును బహిరంగంగా ఎమ్మెల్యే దూషించారు. గుడ్డలూడదీసి కొడతానంటూ అవమానించారు. సర్పంచి ఇంటికి ఎమ్మెల్యే తన అనుచరులతో వెళ్లి దాడికి యత్నించగా వీఆర్వోగా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాసరావు భార్య భయంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆమెను పీఏగా చేరాలంటూ ఫోన్‌లో మెసేజ్‌లతో వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి.
● ఎ.కొండూరు మండలం కంభంపాడులో వైఎస్సార్ సీపీ మండల పరిషత్ అధ్యక్షురాలు నాగలక్ష్మికి చెందిన భవనం అక్రమ నిర్మాణమంటూ తెలుగుదేశం నాయకులు చెప్పడంతోనే మందీ మార్బలంతో వెళ్లిన ఎమ్మెల్యే ఆ భవనాన్ని పట్టపగలు జనం చూస్తుండగా పొక్లెయిన్‌తో కూల్చివేయించారు.
● తిరువూరు బస్టాండ్ సెంటర్లో రెవెన్యూ శాఖకు చెందిన పురాతన గ్రామ చావిడి భవనాన్ని ఎటువంటి అనుమతులు లేకుండా ఎమ్మెల్యే కూల్చివేయించడమే కాక ఈ విషయంలో వీఆర్వో ఫిర్యాదు చేసినా రెవెన్యూ, పోలీసు అధికారులు ఎటువంటి చర్య తీసుకోలేదు. కేవలం పొక్లెయిన్ డ్రైవరు, యజమానిపై కేసు నమోదు చేసి చేతులు దులుపుకొన్నారని ఆరోపణలున్నాయి.
● ఇలా వరుస వివాదాల్లో టీడీపీ నియోజకవర్గ ప్రజాప్రతినిధి కూరుకుపోవడం తప్ప, ఆయన ప్రవర్తనలో మార్పు రావటం లేదని టీడీపీ నాయకులు వాపోతున్నారు. టీడీపీ అధిష్టానం మెతక వైఖరి, పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో ఆయనకు అడ్డూ అదుపూ లేకుండా పోతోందని బాహటంగానే విమర్శిస్తున్నారు.
– ‘పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేశా. ఆయన దళిత ఎమ్మెల్యే అయినప్పటికీ దళితుడినైన నన్ను వేధిస్తున్నారు. నాపై అక్రమ కేసులు పెట్టి తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. నాలాంటి ఎంతో మంది పైకి చెప్పుకోలేక పోతున్నారు. ఎమ్మెల్యే వేధింపులతో ఇక బతకడం అనవసరం. నా చావుతోనైనా తిరువూరు మారి కార్యకర్తలకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నా..’ అంటూ డేవిడ్ అనే టీడీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా కలకలలం రేపింది.
– ఎ.కొండూరు మండలం గోపాలపురం ఎస్టీ కాలనీలో ప్రైవేటు స్థలంలో నిర్మించిన వివాదాస్పద సీసీ రహదారి విషయంలో ఎమ్మెల్యే తన అనుచరులతో గిరిజన మహిళ వార్డు మెంబర్ భూక్యా చంటి ఇంటికి వెళ్లి దౌర్జన్యం చేయడమేకాక భౌతిక దాడికి దిగారు. ఎమ్మెల్యే దౌర్జన్యాలను వీడియో తీస్తున్న చంటి కుమారుడి నుంచి సెల్‌ఫోన్ లాక్కొని ధ్వంసం చేశారు. ఆ మహిళను కాలితో తన్ని అవమానపరచడంతో ఆమె పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసి రెండు నెలలైనా కేసు నమోదు చేయలేదు.
![పరాకాష్టకు వేధింపులు1](https://www.sakshi.com/gallery_images/2025/02/11/09vig01-600877_mr-1739217144-1.jpg)
పరాకాష్టకు వేధింపులు
Comments
Please login to add a commentAdd a comment