![మరియమ](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10vig870-606220_mr-1739217144-0.jpg.webp?itok=6Oa3DxNe)
మరియమాత
మదిమదిలో
విశ్వాస శిఖరం ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతోంది. వేలాదిగా తరలివస్తున్న భక్తజనం మదిమదిలో మరియ మాతను నింపుకొని మనసారా ప్రణమిల్లుతోంది. మొక్కుబడులు చెల్లిస్తూ.. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటూ.. దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరిస్తూ దీవెనలు పొందుతోంది. మేరీమాత తిరునాళ్ల రెండో రోజు సోమవారం రాష్ట్రం నలుమూలల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులతో గుణదల పుణ్యక్షేత్రం కిక్కిరిసింది. ఉత్సాహపరిచే పాటలు.. మనోనేత్రాన్ని వెలిగించే ప్రసంగాలు.. గురువుల సమష్టి దివ్యపూజాబలి, కనువిందు చేసే సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను తన్మయత్వానికి గురిచేస్తున్నాయి.
గుణదల(విజయవాడ తూర్పు): నూరు వసంతాలుగా గుణదల మేరీమాత పుణ్యక్షేత్రం భక్తి విశ్వాసాలకు కేంద్రంగా, పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతోందని ఖమ్మం కథోలిక పీఠాధిపతి సగిలి ప్రకాష్ అన్నారు. గుణదల మేరీమాత పుణ్యక్షేత్రంలో జరుగుతున్న ఉత్సవాల రెండో రోజు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భక్తులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ దైవ కుమారుడైన ఏసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి రక్షణ చేకూరిందని తెలిపారు. మానవాళి రక్షణ ప్రణాళికలో భాగంగా మరియ గర్భవాసాన లోక రక్షకుడు జన్మించారని గుర్తు చేశారు. మరియతల్లి పవిత్రతను బట్టి దేవుడు ఆమెను తన తల్లిగా ఎన్నుకున్నారన్నారు. మరియతల్లి లోక మాతగా కీర్తినొందుతోందని పేర్కొన్నారు.
గుణదల క్షేత్రంలో భక్తుల రద్దీ
విజయవాడ బిషప్ తెలగతోటి రాజారావు మాట్లాడుతూ, మరియతల్లిపై భక్తులకు అమితమైన విశ్వాసం ఉండబట్టే మేరీమాత పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుందని తెలిపారు. ఉత్సవాలు సమర్థంగా జరుగుతున్నాయంటే మరియతల్లి దీవెనలే కారణమని వివరించారు. మరియమ్మను ఆశ్రయించి భక్తులందరూ దీవెనలు పొందాలని కాంక్షించారు. అనంతరం సమష్టి దివ్యబలి పూజ సమర్పించి భక్తులకు సత్ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ ఏలేటి విలియం జయరాజు, వికార్ జనరల్ ఫాదర్ గాబ్రియేలు, మోన్సిగ్నోర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, పలు విచారణల గురువులు పాల్గొన్నారు.
రెండో రోజు కొనసాగిన మేరీమాత తిరునాళ్ల సమష్టి దివ్యపూజాబలి సమర్పించిన ఖమ్మం కథోలిక పీఠాధిపతి ప్రకాష్ ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
భక్తజనసంద్రమైన విశ్వాస శిఖరం
మరియతల్లి దీవెనలతో..
![మరియమాత1](https://www.sakshi.com/gallery_images/2025/02/11/10vig854-6062201.tiffff_mr-1739217144-1.jpg)
మరియమాత
Comments
Please login to add a commentAdd a comment