![పరిణయ](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10jpt61-310100_mr-1739217145-0.jpg.webp?itok=xvwQFS_G)
పరిణయ వేడుక.. పరిమళ వేదిక
విద్యుత్ దీపకాంతులతో మెరిసిపోతున్న తిరుపతమ్మ ఆలయం
పెనుగంచిప్రోలు: రాష్ట్ర ప్రజలచే విశేష పూజలందుకుంటున్న తిరుపతమ్మవారి ప్రథమ (పెద్ద) తిరునాళ్లకు అమ్మవారి ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. మంగళవారం నుంచి ప్రారంభమయ్యే తిరునాళ్లకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. వారి సౌకర్యార్థం ఆలయ ఈవో బీహెచ్‌వీఎస్‌ఎన్ కిశోర్ కుమార్, ఈఈ ఎల్. రమ, పాలకవర్గ సభ్యులు ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. ఆలయాన్ని విద్యుత్ దీప కాంతులతో అలంకరించారు. మంగళవారం రాత్రి జరిగే అమ్మవారి కల్యాణానికై 70 అడుగుల భారీ కల్యాణ వేదికను ఏర్పాటు చేశారు. భక్తులు దూరం నుంచి చూసేందుకు వీలుగా కల్యాణ మండపం వద్ద, గ్రామంలో భారీ స్క్రీన్‌లు ఏర్పాటు చేయటంతో పాటు టీవీ చానల్ ద్వారా రాష్ట్ర ప్రజలు ప్రత్యక్షంగా తిలకించే అవకాశం కల్పిస్తున్నారు. అలాగే కల్యాణ మహోత్సవం పలు జిల్లాల ప్రజలకు తెలిసే విధంగా ఇబ్రహీంపట్నం, ఖమ్మం జిల్లా బోనకల్లు, చిల్లకల్లు, ముండ్లపాడు, మక్కపేట క్రాస్‌రోడ్స్ వద్ద, జాతీయ రహదారిపై స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు.
కార్యక్రమాలు ఇలా..
ఫిబ్రవరి 11న, మాఘశుద్ధ పౌర్ణమి మంగళవారం రాత్రి 9 గంటల 32 నిముషాలకు గోపయ్య సమేత శ్రీతిరుపతమ్మవారి కల్యాణం నిర్వహిస్తామని ఆలయ వర్గాలు పేర్కొన్నాయి. కల్యాణం రోజు ఉదయం నుంచి దీక్షా స్వాములు తిరుముడి సమర్పిస్తారని, ఫిబ్రవరి 12న మధ్యాహ్నం జలబిందెలు, 13న ఉదయం ఉదయపొంగళ్లు, అంకసేవ, 14న దీవెన బండారు, బోనాలు, ఫిబ్రవరి 15న పూర్ణాహుతితో పెద్ద తిరునాళ్ల ముగుస్తాయని ఈవో తెలిపారు.
తిరుపతమ్మ కల్యాణోత్సవానికి సర్వం సిద్ధం నేటి నుంచి పెద్ద తిరునాళ్ల ప్రారంభం
![పరిణయ వేడుక.. పరిమళ వేదిక1](https://www.sakshi.com/gallery_images/2025/02/11/10jpt74-310100_mr-1739217146-1.jpg)
పరిణయ వేడుక.. పరిమళ వేదిక
Comments
Please login to add a commentAdd a comment