![రాష్ట](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/11022025-v_amt_tab-11_subgroupimage_1883343312_mr-1739217145-0.jpg.webp?itok=qgFEWRCb)
రాష్ట్ర బాడీబిల్డింగ్ జట్టు ఎంపిక
పెనమలూరు: జాతీయ స్థాయిలో జరగనున్న ఫెడరేషన్ కప్ బాడీ బిల్డింగ్ పోటీలకు రాష్ట్ర జట్టును ఎంపిక చేశామని బాడీ బిల్డింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.శ్రీనివాసరావు, ఉమ్మడి కృష్ణా జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ కార్యదర్శి తాళ్లూరి అశోక్ తెలిపారు. ఈ మేరకు సోమవారం వివరాలు తెలుపుతూ ఫెడరేషన్ కప్ బాడీబిల్డింగ్ పోటీలు ఈ నెల 22, 23వ తేదీలలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలో జరుగుతాయన్నారు. పోటీల్లో పాల్గొనటానికి క్రీడాకారులను కానూరులో ఎంపిక చేశామని తెలిపారు. రాష్ట్ర జట్టులో జి.దినేష్, ఎస్‌కే ఆలీమ్, జి.ఖాశీం, డి.రాజేష్, డి.రమేష్, ఎం.దినేష్ చోటు సంపాదించారన్నారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు స్వామి, జిల్లా అధ్యక్షుడు మనోహర్ పాల్గొనగా, ఎంపిక కమిటీ చైర్మన్‌గా గల్లా శ్రీను వ్యవహరించారు.
ఫొటో, వీడియోగ్రఫీలో ఉచిత శిక్షణ
మచిలీపట్నంఅర్బన్: స్థానిక మల్కాపట్నంలోని డాక్టర్ పట్టాభి గ్రామీణాభివృద్ధి సంస్థలో గ్రామీణ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఫొటో, వీడియోగ్రఫీలలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నామని సంస్థ డైరెక్టర్ ఎం. గోపీనాథ్ సోమవారం తెలిపారు. శిక్షణ సమయంలో దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు ఉచిత హాస్టల్ వసతి, భోజనం, ప్రయాణపు ఖర్చులు ఇస్తామన్నారు. శిక్షణ అనంతరం ప్రభుత్వ సర్టిఫికెట్, బ్యాంకు రుణం కోసం సహాయం అందజేస్తామని తెలిపారు. 18 నుంచి 45ఏళ్లు లోపు ఉండి, కనీసం 10వ తరగతి చదివిన వారు అర్హులని అన్నారు. దరఖాస్తులను ఈ నెల 11వ తేదీ(మంగళవారం)లోపు మచిలీపట్నం కార్యాలయంలో స్వయంగా గానీ లేదా rsetimachilipatnam.in వెబ్‌సైట్‌లో గానీ నమోదు చేసుకోవచ్చని ఆయన తెలిపారు.
ప్రభుత్వం దిగివచ్చే
వరకూ ఆందోళన
గన్నవరం: ఉపకార వేతనాలు పెంచాలని కోరుతూ స్థానిక ఎన్టీఆర్ పశువైద్య కళాశాల విద్యార్థులు చేపట్టిన రిలే నిరహార దీక్షలు సోమవారం 8వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో విద్యార్థులు విజేంద్రవర్మ, అంజిరెడ్డి, రిషిత, హైమవతి కూర్చున్నారు. మిగిలిన వెటర్నరీ విద్యార్థులతో పాటు పీజీ విద్యార్థులు వీరికి సంఘీభావం తెలిపారు. న్యాయబద్ధమైన తమ డిమాండ్‌ను ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విద్యార్థి సంఘ నేతలు పునీత్, ధర్మతేజ, భానుప్రకాష్, శ్రీనివాసరావు మాట్లాడుతూ సాధారణ వైద్య విద్యార్థులకు రూ. 23 వేలు నుంచి రూ. 26 వేలు చెల్లిస్తున్న ప్రభుత్వం వెటర్నరీ విద్యార్థులకు మాత్రం 2013 నుంచి కేవలం రూ. 7వేలు మాత్రమే చెల్లిస్తోందన్నారు. పెరిగిన ఆర్థిక అవసరాలకు అనుగుణంగా స్టైఫండ్ పెంచాలని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకున్న దాఖలాలు లేవని వాపోయారు. కళాశాల బీవీఎస్సీ, పీజీ విద్యార్థులు పాల్గొన్నారు.
గాయత్రికి అభినందన
చిలకలపూడి(మచిలీపట్నం): జాతీయ స్విమ్మింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన నాగిడి గాయత్రిని కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం అభినందించారు. కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో గాయత్రిని ఆయన శాలువాతో సత్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగిన క్రీడాపోటీల్లో నాగాయలంక గ్రామానికి చెందిన నాగిడి గాయత్రి స్విమ్మింగ్ మహిళల విభాగంలో ప్రతిభను ప్రదర్శించి బంగారు పతకాన్ని సాధించడం అభినందనీయమన్నారు. గాయత్రికి అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించేందుకు పూర్తి సహకారం అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. జేసీ గీతాంజలిశర్మ, జిల్లా స్పోర్ట్స్ అధికారి ఝాన్సీలక్ష్మి ఉన్నారు.
![రాష్ట్ర బాడీబిల్డింగ్ జట్టు ఎంపిక
1](https://www.sakshi.com/gallery_images/2025/02/11/10pnm52a-310162_mr-1739217145-1.jpg)
రాష్ట్ర బాడీబిల్డింగ్ జట్టు ఎంపిక
![రాష్ట్ర బాడీబిల్డింగ్ జట్టు ఎంపిక
2](https://www.sakshi.com/gallery_images/2025/02/11/10gvm03-310152_mr-1739217145-2.jpg)
రాష్ట్ర బాడీబిల్డింగ్ జట్టు ఎంపిక
Comments
Please login to add a commentAdd a comment