![నులిపురుగుల నివారణ అత్యవసరం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10vic162-310137_mr-1739217146-0.jpg.webp?itok=xc25G-a7)
నులిపురుగుల నివారణ అత్యవసరం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): నులి పురుగులు పిల్లలు, కిశోర బాలల్లో రక్తహీనత, పోషకాల లోపాలకు కారణమవుతాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. నులిపురుగుల నివారణకు ఆల్బెండజోల్ మాత్రను తీసుకోవాలన్నారు. సోమవారం గవర్నర్‌పేటలోని సీవీఆర్ మున్సిపల్ స్కూల్ నందు జరిగిన జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ పాల్గొన్నారు. అధికారులతో కలిసి చిన్నారులకు స్వయంగా ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నులి పురుగుల వల్ల శారీరక సమస్యలతో పాటు మానసిక ఆరోగ్య సమస్యలు వస్తాయన్నారు. ఇది పిల్లల చదువుపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యల బారినపడకుండా చూసుకోవచ్చన్నారు. సోమవారం 1–19 ఏళ్ల వయసు వారందరికీ ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశామని.. ఇంకా ఎవరైనా వివిధ కారణాల వల్ల మాత్ర తీసుకోకుండా ఉండిపోతే వారికి ఈ నెల 17వ తేదీన ఇస్తామన్నారు. డీఎంహెచ్‌వో డాక్టర్ ఎం.సుహాసిని మాట్లాడుతూ ఏడాదికి రెండుసార్లు పిల్లలు, కిశోర బాలలకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇన్‌లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా విజయవాడ డివిజన్ ఆధ్వర్యంలో జల రవాణాపై విద్యార్థులకు నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో విజేతలకు కలెక్టర్ లక్ష్మీశ, అథారిటీ డైరెక్టర్ అజిత్‌సింగ్‌తో కలిసి బహుమతులు ప్రదానం చేశారు. డీఈవో యూవీ సుబ్బారావు, ఐసీడీఎస్ పీడీ డి.శ్రీలక్ష్మి, జిల్లా రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం అధికారి, ప్రోగ్రామ్ ఇన్‌చార్జ్ మాధవి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సీహెచ్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
Comments
Please login to add a commentAdd a comment