అవగాహన ర్యాలీ ప్రారంభం
చిలకలపూడి(మచిలీపట్నం): విభిన్న ప్రతిభావంతులైన పిల్లలను గుర్తించేందుకు డోర్ టు డోర్ సర్వే నిర్వహించేందుకు అవగాహన ర్యాలీని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక సోమవారం జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయసేవాధికార సంస్థ వద్ద ఈ ర్యాలీ ప్రారంభించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలో వికలాంగ పిల్లలను గుర్తించేందుకు డోర్ టు డోర్ సర్వే జరుగుతుందన్నారు. ఈ సర్వేలో గుర్తించిన వారి వివరాలను న్యాయసేవాధికార సంస్థకు సమాచారం తెలియజేస్తారన్నారు. తదనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ప్రవేశపెట్టిన పథకాలు వారికి వర్తింపజేసేలా తగు చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కేవీ రామకృష్ణయ్య పాల్గొన్నారు.
ముగిసిన నామినేషన్ల పర్వం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలోని కృష్ణా–గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్ల స్వీకరణ గడువు సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు ముగిసింది. చివరిరోజున పెద్దఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. సోమవారం ఒక్కరోజే 22 మంది అభ్యర్థులు 43 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ఘట్టం ముగిసే సమయానికి 40 మంది అభ్యర్థులు 69 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల పరిశీలన మంగళవారం ఉదయం 11 గంటలకు చేపడతారు. ఈ నెల 27న ఎన్నిక జరగనుంది. ప్రధానంగా పోటీ ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్న కె.ఎస్. లక్ష్మణరావు, తెలుగుదేశం అభ్యర్థి ఆలపాటి రాజా మధ్య జరగనుంది. అన్ని రంగాల నుంచి పలువురు పోటీలో నిలబడ్డారు. కె.ఎస్. లక్ష్మణరావు ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు. ఆయనకు వామపక్షాలు, విద్యార్థి, యువజన, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే మస్తాన్‌వలీ మద్దతు ప్రకటించారు. వలంటీర్లను కూటమి ప్రభుత్వం మోసం చేసిన నేపథ్యంలో కృష్ణా జిల్లా నుంచి వలంటీర్ ఒకరు బరిలో నిలబడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment