సాధించిన పత్రాలు, కప్‌లతో కోచ్ శ్రీనివాసరావు
శృంగవరపుకోట: చిన్నవయస్సులో కలిగిన ఆసక్తితో నేర్చుకున్న విద్య నేడు కూడు పెడుతోందంటూ ఓ కరాటే మాస్టార్ జీవం లేని నవ్వుతూ చెబుతూ కరాటేలో చిచ్చర పిడుగుల్ని తయారు చేస్తున్నాడు. గుండెల నిండా ఆత్మవిశ్వాసం, విద్యపట్ల అంకితభావం, లక్ష్యంపై దీక్ష ఉన్నా పేదరికం ఆయన పాలిట శాపమైంది. ఎస్.కోటలో నివాసం ఉంటున్న వంకల శ్రీనివాసరావు కరాటేలో ‘బ్లాక్‌బెల్ట్ 5డాన్’ గా అర్హత సాధించి మాస్టర్‌గా నిలిచారు. అటుపై స్థాయిలు సాధించేందుకు మంచి శిక్షణ, భోజనం, వసతి అవసరం. ఇటు సంసారం సాగే దారిలేక, డబ్బు పెట్టలేక ఆర్థికస్థోమత సరిపోక ఆశలు వదులుకున్నారు.
ఆత్మవిశ్వాసమే ఆలంబనగా..
మండలంలోని వెంకటరమణపేట గ్రామానికి చెందిన వంకల శ్రీనివాసరావుకు బ్రూస్‌లీ సినిమాతో ఆత్మరక్షణ విద్యలు నేర్చుకోవాలనే ఆలోచన చిన్నతనంలో మొదలైంది. తిమిడి జెడ్పీ హైస్కూల్‌లో 7వ తరగతి చదివేటప్పుడు కొత్తవలస స్కూల్‌లో కరాటే నేర్పుతున్నారని తెలిసి సైకిల్‌పై కొత్తవలస వెళ్లిపోయాడు. అక్కడ గురువు ఈవీవీ ప్రసాద్ శిష్యరికం చేసి 8 ఏళ్ల పాటు కరాటే సాధన చేశాడు. తర్వాత విశాఖలోని గోపాలపట్నానికి దిన కనకారావు మాస్టర్ వద్ద ఐదేళ్లు సాధనచేసి 2022జనవరిలో సికింద్రాబాద్‌లో వైడబ్ల్యూసీఏ నేతృత్వంలో నడుస్తున్న ఒకినావా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ నిర్వహించిన టోర్నీలో బ్లాక్‌బెల్ట్ సాధించాడు.
రోజు కూలీగా శిక్షణ ఇస్తూ..
ఆర్థిక స్థోమత లేక ఇంటర్‌మీడియట్‌తో చదువు ఆపేసిన శ్రీనివాసరావు ఇల్లు గడవడం కోసం 1998నుంచి పట్టణంలోని పలు పాఠశాలల్లో విద్యార్థులు కరాటేలో శిక్షణ ఇవ్వడం ఆరంభించాడు. ఒకరోజు పిల్లలకు క్లాస్ చెబితే రూ.30, 50 రోజుకూలిగా ఇచ్చేవారని చెబుతున్నారు. వ్యవసాయకూలీ కుటుంబంలో పుట్టిన తనకు ఐదుగురు అక్కలు ఉండడంతో ఆస్తి కన్నా అప్పులే ఎక్కువ మిగిలాయని వాపోయారు. సంసార బాధ్యతలతో స్కూళ్లలో రెగ్యులర్ కరాటే కోచ్‌గా జాయిన్ అయి ఇప్పుడు మెరికల్లాటి విన్నర్స్‌ను తయారు చేసే పనిలో పడ్డాడీ మాస్టర్. ప్రస్తుతం ఈమాస్టర్ వద్ద శిక్షణ పొందుతున్న ఎస్.నీలేష్, జె.జగదీష్, ఎం.తరుణ్‌లు ఇంటర్నేషనల్స్, నేషనల్స్, ఏషియన్ గేమ్స్‌లో స్వర్ణ, రజత పతకాలు సాధించారు.
ఆత్మవిశ్వాసమే ఆలంబన
స్పాన్సర్ చేస్తే మరింత సాధించాలని
కరాటేలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఉంది. అందుకు సరైన శిక్షణ, వసతి, భోజనం అవసరం. నాకు తగిన ఆర్థిక స్థోమత లేక మక్కువ ఉన్నా వదులుకున్నాను. ఎవరైనా సాయం చేస్తే మరింత ఉన్నత స్థాయికి ఎదగాలనే కోరిక ఉంది. పూర్తిస్థాయి గ్రాండ్‌మాస్టర్‌గా ఎదిగి ఈ ప్రాంతం యువతను తయారు చేయాలనేది లక్ష్యం.
– వంకల శ్రీనివాసరావు,
బ్లాక్‌బెల్ట్ 5డాన్, ఎస్.కోట
Comments
Please login to add a commentAdd a comment