రైల్వే డివిజన్ ఏర్పాటుకు
రాయగడ: రాయగడలో తూర్పు కోస్తా రైల్వే డివిజన్ ఏర్పాటుకు సన్నద్ధత మొదలైంది. ప్రధాని మోదీ సోమవారం డివిజన్ కార్యాలయ భవన నిర్మాణానికి వర్చువల్ మాధ్యమంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ రాష్ట్రంలో అపార ఖనిజ సంపదలు ఉన్నాయని, వాటిని సక్రమంగా సద్వినియోగపరిచి కొత్త పరిశ్రమలకు ఆహ్వానం పలుకుతామని అన్నారు. దీంతో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు మెరుగు పడతాయని ఆకాంక్షించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయని అన్నారు. ఎన్నాళ్లుగానో ఈ ప్రాంత వాసులు ఎదురుచూస్తున్న రైల్వే డివిజన్ ఏర్పాటు కావడం జగన్నాథుని ఆశీర్వాద బలమేనని అన్నారు. ఈ రైల్వే డివిజన్‌తో ఒడిశా రాష్ట్రం రవాణా రంగంలో మరోమైలు రాయి చేరుకుంటుందని అన్నారు. ఖనిజ సంపదలకు నిలయమైన రాయగడ జిల్లా భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలను అధిరోహించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
రైల్వే డివిజన్ ఏర్పాటులో భాగంగా సుమారు రూ.107 కోట్ల వ్యయంతో అత్యాధునిక సౌకర్యాలు గల డివిజన్ ప్రధాన కార్యాలయ భవనాన్ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని వివరించారు. అదేవిధంగా డివిజన్ నిర్మాణంలో భాగంగా సుమారు 20 వేల కొట్ల రూపాయలతో డివిజన్‌కు సంబంధించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల పనులు త్వరిత గతిన ప్రారంభం కానున్నాయని అన్నారు.
ఒడిశాపై కేంద్రం ప్రత్యేక దృష్టి
అపార ఖనిజ సంపదలు గల ఒడిశా రాష్ట్రాన్ని పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చేయడంతో పాటు రైల్వే రంగంలో కొత్త ఒరవడులను సృష్టించడానికి కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి అన్నారు. రైల్వే డివిజన్ ఏర్పాటులో భాగంగా స్థానిక రైల్వే మైదానంలో సొమవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి ఆయన హాజరై ప్రసంగించారు. రాష్ట్రంలొ గల డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తుందని అన్నారు. ముఖ్యంగా ఖనిజ సంపదలు గల ఈ రాష్ట్రం పారిశ్రామిక హబ్ గా గుర్తింపు పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అహర్నిశలు బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. బాకై ్సట్ నిక్షేపాలు గల రాయగడ జిల్లాలో ఉత్కళ అలూమిన, ఇండియన్ మెటల్స్ అండ్ ఫెర్నొ ఎల్లొయిస్, జేకేపేపర్ మిల్ వంటి బృహత్తర పరిశ్రమలు ఇప్పటికే ఉన్నాయని, రానున్న రోజుల్లో మరిన్ని బృహత్తర పరిశ్రమలు ఈ జిల్లాలో ఏర్పాటు కానున్నాయని అన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా బీజేపీ ప్రభుత్వం సుమారు రూ.1.50 వేల కోట్లతో బృహత్తర ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ముఖ్యమంత్రి మాఝి ఈ సందర్భంగా తెలియజేశారు. గత పదేళ్లలో రాష్ట్రం రైల్వే రంగంలో చెప్పుకోదగ్గ అభివృద్ధిని సాధించిందని అన్నారు.
రాయగడలో మెడికల్ కళాశాల
అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు నడుస్తున్న రాయగడలో త్వరలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం యోచిస్తోందని ముఖ్యమంత్రి మాఝి వివరించారు. త్వరలో ఈ జిల్లా ప్రజలు తీపి కబురు విననున్నారని అన్నారు. వైద్య రంగంలో మరిన్ని సౌకర్యాలను ప్రజలకు అందేలా చూస్తామని అన్నారు. ఆధునిక సౌకర్యాలతో ఈ జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటు తథ్యమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నిత్యానంద గొండ, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రణవీత్ సింగ్ బిట్టు, నవరంగపూర్ ఎంపీ భలభద్ర మాఝి, కలహండి ఎంపి మాల్విక దేవి, బరంపురం ఎంపీ డాక్టర్ ప్రదీప్ కుమార్ మాఝి, కొరాపుట్ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలక, రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక, తూర్పుకొస్తా రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర్ పంక్వాల్, డిఆర్‌ఎం విశాఖపట్నం మనొజ్ కుమార్ సాహు తదితర ప్రముఖులు, రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment