రంగుమారిన ధాన్యం కొనుగోలు చేయాలి
పర్లాకిమిడి: అకాల వర్షాలకు రంగుమారిన ధాన్యాన్ని రైతుల వద్ద నుంచి అధికారులు కొనుగోలు చేయాలని పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి కోరారు. పట్టణంలోని సంతపేట వద్ద ప్రాంతీయ మార్కెటీ కమిటీ యార్డు (ఆర్‌ఎంసీఎస్) వద్ద జరిగిన జిల్లా ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, జిల్లా పరిషత్ అధ్యక్షుడు గవర తిరుపతిరావులు పాల్గొని ప్రారంభించారు. ఆర్‌ఎంసీ కార్యదర్శి రేబతీమోహన్ రౌత్ అధ్యక్షత వహించగా కలెక్టర్ బిజయ కుమార్ దాస్, జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ పండా, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ప్రఫుల్ల కుమార్ నాయక్, డీఆర్‌సీఎస్ హరిహరశెఠి తదితరులు పాల్గొన్నారు.
రైతుల అకౌంట్లలో జమ
ఎఫ్‌ఏక్యూ ధాన్యం క్వింటాకు రూ.2,300 మరియు ఇన్‌పుట్ సబ్సిడీ రూ.800లు కలిపి రైతుల అకౌంట్లలో జమ చేస్తామని పౌరసరఫరాల శాఖ అధికారి ప్రఫుల్ల కుమార్ నాయక్ వెల్లడించారు. జిల్లాలో 45 ప్యాక్స్ (పంచాయితీ సోసైటీలు), 11 మంది మిల్లర్లు ద్వారా ఖరీఫ్ పంటను కొనుగోలు చేస్తామన్నారు. జిల్లా పరిషత్ అధ్యక్షుడు గవర తిరుపతిరావు రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ.. కొందరు రైతులు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకున్నారన్నారు. ధాన్యాన్ని ఎండబెట్టి మండీలకు పంపించాలని సూచించారు. అధికారులు కూడా మండీల వద్ద రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేటప్పుడు సహకరించాలన్నారు. ప్రభుత్వం ఖరీఫ్ మొదటి పర్యాయం 5.88 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు లక్ష్యం పెట్టుకున్నట్టు కలెక్టర్ బిజయ కుమార్ దాస్ తెలిపారు.
రైతుల గగ్గోలు
జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ప్రఫుల్ల కుమార్ నాయక్ మాట్లాడుతుండగా ఒక్కసారిగా రైతులు గగ్గోలు పెట్టారు. మకర సంక్రాంతి సమీపిస్తున్నా ఽఖరీఫ్ పంటను అధికారులు కొనుగోలు చేయకుండా ఎఫ్‌ఏక్యూ పరీక్షలు చేస్తామని అనడం సమంజసం కాదన్నారు. స్వయంగా సీఎం మోహన్ చరణ్ మాఝీ గుసాని సమితిలో పర్యటించి రంగుమారిన ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చినా, అధికారులు విపరీత ధోరణితో మాట్లాడుతున్నారన్నారు. రైతు సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ పట్నాయక్, జెడ్పీటీసీ(గుసాని) ఎస్.బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment