ఆలయ హుండీ లెక్కింపు
రాయగడ: స్థానిక భైరవీధిలో ఉన్న గ్రామ దేవత బురదల పోలమ్మ అమ్మవారి హుండీ ఆదాయ లెక్కింపు మంగళవారం జరిగింది. ఆలయ ప్రాంగణంలో అందరి సమక్షంలో హుండీని తెరిచిన సభ్యులు ఈ మేరకు లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు. భక్తులు హుండీలో వేసిన కానుకల రూపంలో రూ.1,65,070ల నగదు వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ మొత్తం ఆదాయాన్ని అమ్మవారి పేరిట బ్యాంకులో డిపాజిట్ చేయనున్నట్లు పేర్కొన్నారు.
రిజిస్ట్రార్‌గా మహేష్
చంద్ర నాయక్
కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లా అదనపు మేజిస్ట్రేట్ మహేష్ చంద్ర నాయక్ కొరాపుట్ జిల్లా జయపూర్‌లోని విక్రమ్ దేవ్ యునివర్సిటీ రిజిస్ట్రార్‌గా నియామకమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగ్గ అదేశాలు మంగళవారం జారీ చేసింది. మహేష్ చంద్ర గతంలో జయపూర్ సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేశారు. రాయగడ జిల్లాకి చెందిన మహేష్ చంద్ర అవిభక్త కొరాపుట్ జిల్లాలో అనేక ఏళ్లు జిల్లాస్థాయి ఉన్నతాధికారిగా వివిధ హోదాల్లో పని చేశారు. తన పూర్వీకుల నుంచి వస్తున్న ఆస్తులు మెత్తం తన స్వగ్రామంలో పేదలకు పంచి గతంలో వార్తల్లో నిలిచారు.
శిశువు మృతదేహం లభ్యం
మల్కన్‌గిరి: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలో ఉన్న కాలువ గట్టు వద్ద సోమవారం అర్థరాత్రి కుక్కలు పీకుతున్న ఒక శిశువు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. దీంతో మల్కన్‌గిరి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఐఐసీ రీగాన్‌కీండో తన సిబ్బందితో వెళ్లి దర్యాప్తు ప్రారంభించారు. ఎవరైనా ప్రసవ అనంతరం బిడ్డ మృతి చెందిదే ఇలా పడేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలా చేయడం నేరమని, నిందితులను పట్టుకొని శిక్షిస్తామని పోలీసులు పేర్కొన్నారు.
విమానాశ్రయంలో
గంజాయి స్వాధీనం
భువనేశ్వర్: స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విలువైన గంజాయి మంగళవారం పట్టుబడింది. మహిళా ప్రయాణికురాలి దగ్గర దీనిని గుర్తించారు. అధికారులకు పట్టుబడిన గంజాయి మార్కెట్ విలువ సుమారు రూ.9 కోట్లు ఉంటుందని అంచనా. ఈ మహిళ కౌలాలంపూర్ నుంచి భువనేశ్వర్ ప్రయాణించినట్లు తేలింది. విచారణ కొనసాగుతోంది. స్థానిక విభాగం అధికారుల తనిఖీలో ఈ అక్రమ రవాణా విషయం గుట్టురట్టు అయింది. నిందిత మహిళ ప్రయాణికురాలు నిషిద్ధ గంజాయిని ఒక సంచిలో పెట్టుకొని ప్రయాణించింది. చిన్న పొట్లాలుగా సంచిలో పేర్చుకుని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు. మలేషియా కౌలాలంపూర్ నుంచి భువనేశ్వర్ విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు సామాన్ల తనిఖీ సమయంలో ఆమె సామాన్లలో 19 పొట్లాల్లో గంజాయి పట్టుబడింది. దీంతో ఈ గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మహిళను అరెస్టు చేశారు. ఈ వ్యవహారం పూర్వాపరాలు వెలుగులోకి తీసుకొచ్చేందుకు అనుబంధ విభాగాల ఉన్నతాధికార వర్గాలు రంగంలోకి దిగాయి.
Comments
Please login to add a commentAdd a comment